Bhadradri Kothagudem:భద్రాద్రి రామాలయంలో ఘనంగా ప్రారంభమైన తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తిరుకల్యాణోత్సవాలతో పాటు ఈనెల 31న జరిగే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలకు కూడా అంకురార్పణ చేశారు.
ఉదయం మూలమూర్తుల వద్ద ఉత్సవ అనుజ్ఞ తీసుకున్న తర్వాత శ్రీ సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్ర స్వామి వారి ఉత్సవ మూర్తులను చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. మొదట ఓంకార ధ్వజారోహణం జరిపి, ఉత్సవ మూర్తులకు ఉత్సవాంగ స్నపనం నిర్వహించారు. ఆ తర్వాత విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం, రక్షా బంధనం గావించారు.
అనంతరం ఆలయ ఏఈవోలు శ్రవణ్‌కుమార్, భవానీ రామకృష్ణ రామాయణ పారాయణదారులకు, ఆచార్య, బ్రహ్మ, రుత్విక్ లకు దీక్షా వస్త్రాలు అందజేశారు. తర్వాత మూలమూర్తులు, ఉత్సవ పెరుమాళ్లు, నిత్యకల్యాణ మూర్తులతో పాటు ఆచార్య, బ్రహ్మ, రుత్విక్ కు అర్చకులు దీక్షా కంకణధారణ చేశారు.
ఇదిలా ఉండగాఇక సాయంత్రం స్వామి వారి ఉత్సవ మూర్తులను కల్పవృక్ష వాహనంపై కొలువుదీర్చి తాతగుడి సెంటర్లోని గోవిందరాజ స్వామి ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ సేకరించిన పుట్ట మట్టిని మరో వాహనంపై ఉంచి ఆలయానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలతో మృత్సంగ్రహణం నిర్వ హించారు. ఈ పూజల్లో ఆలయ అర్చకులు, వేదపండితులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
కాగా, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక వేడుకలకు 22న అంకురార్పణ జరగగా.. బ్రహ్మోత్సవాలకు అయితే ఈనెల 26న అంకురార్పణ చేస్తామని దేవస్థానం వారు ముద్రించిన కరపత్రాల్లో పేర్కొన్నప్పటికీ రెండు వేడుకలకూ బుధవారమే అంకురార్పణ చేయడం వింతగా వుంద. అంతేకాకుండా సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని దేవస్థానానికి దగ్గరగా ఏర్పాటు చేసిన తాత్కాలిక యాగశాలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగాయాగశాలలో పర్యగ్నీకరణం కార్యక్రమాన్ని అత్యంత వైభవ్వేతంగా శాస్త్రీయతంగా నిర్వహించారు.మేళతాళాలు, కోలాటాల నడుమ ఉత్సవ మూర్తులను పల్లకీ సేవగా తీసుకొచ్చి నూతనంగా నిర్మించిన తాత్కాలిక యాగశాలలలో వేంచేపు చేశారు. ఆ తర్వాత వాస్తు పూజ, వాస్తు హోమం, పర్యగ్నీకరణం జరిపారు.
ఈ సందర్భంగా వేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు మాట్లాడుతూ రామ మహాక్రతువు జరిగే పుష్కర, చతుర్వేద యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.