Vasathi Deevena: నేడు జగనన్న వసతి దీవెన నిధుల విడుదల
YSRCP: ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో వాయిదా పడిన జగనన్న వసతి దీవెన నిధుల విడుదల కార్యక్రమాన్ని నేడు నేడు నార్పలలో నిర్వహించనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్ధులకు జగనన్న వసతి దీవెన నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు విడుదల చేయనున్నారు. విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 912.71 కోట్ల రుపాయల నిధులను జమ చేయనున్నారు. అనంతపురం జిల్లా నార్పలలో నిర్వహించే కార్యక్రమంలో విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు. బుధవారం జమ చేస్తున్న రూ. 912.71 కోట్లతో కలిపి జగనన్న వసతి దీవెన ద్వారా ఇప్పటివరకు 25,17,245 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 4,275.76 కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
జగనన్న వసతి దీవెన
2017 నుంచి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 1,778 కోట్లు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన కింద ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం రూ. 14,223.60 కోట్లు అందించింది. వసతి దీవెన పథకం కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు భోజన, వసతి ఖర్చులకోసం ఇబ్బంది పడకుండా యేటా రెండు వాయిదాల్లో ఐటీ విద్యార్థులకు రూ. 10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15వేలు చొప్పున, మెడిసిన్, ఇంజనీరింగ్, డిగ్రీ, వివిధ కోర్సుల్లో విద్యను అభ్యసించే వారికి రూ. 20వేల చొప్పున ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అందరికి ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నారు. విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నారు.
2018–19 సంవత్సరంలో 32.4 గా ఉన్న స్ధూల నమోదు నిష్పత్తి (జీఈఆర్), రాబోయే రోజుల్లో జీఈఆర్ శాతం 70కి తీసుకువెళ్ళేలా చర్యలు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. 2018–19 లో సగటున ప్రతి 100 మంది బాలురకు 81 మంది బాలికలు కళాశాలల్లో చేరితే 2020–21 నాటికి ఈ సగటు 94కు పెరిగింది.2018–19లో 37,000 గా ఉన్న క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కూడా గణనీయంగా పెరిగి 2021–22 నాటికి 85,000 కు చేరాయని గణంకాలు చెబుతున్నాయి.
జగనన్న విదేశీ విద్యా కు శ్రీకారం
రాష్ట్ర విద్యార్థులను అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది చదువుల్లో నాణ్యత పెంపొందించి ప్రపంచంతో పోటీ పడేలా ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ కోర్సులకు సంబంధించి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో మేలు చేకూర్చేలా ప్రతిభకు పెద్దపీట వేస్తూ మార్గదర్శకాలను రూపొందించింది.
వార్షిక ఆదాయ పరిమితిని పెంచి ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణ పేదలకు కూడా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చేలా చర్యలు చేపట్టింది. క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీల్లో సీటు సాధించిన ఏపీ విద్యార్థుల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్–100 యూనివర్సిటీల్లో సీటు సాధించే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వర్తింపచేస్తుంది.
టాప్ 100 – 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్సిటీల్లో సీట్లు పొందిన వారికి రూ.50 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. తద్వారా రాష్ట్ర విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచడంతోపాటు నాణ్యతతో కూడిన ఉన్నత చదువులు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.