Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు తప్పిన ప్రమాదం …. గేదె దుర్మరణం
Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లకు గేదెలు అడ్డు వస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గేదెలు అడ్డు రావడం వల్ల వందే భారత్ ట్రైన్ల ప్రయాణానికి అసౌకర్యం కలుగుతుంది. ట్రాక్‌లపై వందే భారత్ ట్రైన్లు వెళుతున్న సమయంలో పశువులు ఒక్కసారిగా అడ్డుగా వస్తున్నాయి. దీని వల్ల వందే భారత్ ట్రైన్లను నిలిపివేయాల్సి వస్తుంది. పశువులు అడ్డు రావడం వల్ల వందే భారత్ ట్రైన్ల ముందు భాగాలు కూడా దెబ్బతింటున్నాయి. ఈ ఘటనల్లో పశువులు కూడా మృతి చెందుతున్నాయి. తాజాగా మరోసారి అలాంటి ఘటన చోటుచేసుకుంది.
మిర్యాలగూడ రైల్వేస్టేషన్లో స్టాప్ లేకపోవడంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్ రైలు అదే వేగంతో నడుస్తోంది. మిర్యాలగూడ మండలం తీక్యాతండా సమీపంలో ఉదయం 9 గంటల సమయంలో రైలు పట్టాలపై గేదె వచ్చింది. అయితే వేగంగా వచ్చిన వందేభారత్ రైలు ఢీకొనడంతో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన డ్రైవర్ వెంటనే రైలును ఆపి తనిఖీ చేశారు. ఈ ఘటనలో రైలు డ్యామేజ్ కాలేదని తెలుసుకున్న తర్వాత తిరిగి బయలుదేరింది. ఘటనా స్థలాన్ని రైల్వే ఎస్ఐ పవన్‌కుమార్‌రెడ్డి, ఏఎస్ఐ ప్రసాద్ పరిశీలించారు. గేదె యజమాని కోసం వెతుకుతున్నారు. గేదెలను రైల్వే పట్టాలవైపు తీసుకురావొద్దని స్థానికులను సూచించారు. గేదెలను రైల్వే ట్రాక్‌లవైపు పంపిస్తే చర్యలు తీసుకుంటామని స్థానికులను పోలీసులు హెచ్చరించారు.
Also Watch
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పశువులను ఢీకొట్టి గతంలోనూ పలుమార్లు ప్రమాదానికి గురైంది. కిందటి ఏడాది అక్టోబర్‌లో గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో వందే భారత్ రైలు గేదెలను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇంజిన్ ముందు భాగం ధ్వంసమైంది. రైలుకు అడ్డంగా వచ్చిన నాలుగు గేదెలు మృత్యువాతపడ్డాయి. ఆ మరుసటి రోజే ఆనంద్ స్టేషన్ సమీపంలో ఆవును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్ ముందు భాగం పాక్షికంగా ధ్వంసమైంది.
వందే భారత్ రైలు పశువులను ఢీకొట్టి ప్రమాదానికి గురైన ఘటనలపై విమర్శలు కూడా వస్తున్నాయ్. కేసీఆర్ దీనిపై అసెంబ్లీ వేదికగానే విమర్శలు చేశారు. ‘బర్రె గుద్దితే పగిలిపోయే రైలు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.