సూపర్‌ కృష్ణ ఇక లేరు.. విషాదంలో సినీ పరిశ్రమ…..

సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ (80) ఇక లేరు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కార్డియాక్‌ అరెస్టుతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ 1942 మే 31 గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు. అలా మొదలైన ఆయన సినీ ప్రస్థానం నాలుగు దశాబ్దాలకుపైగా సాగింది. సినీ కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తెరకెక్కించారు. 1983లో ప్రభుత్వ సహకారంతో సొంతంగా పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో నెలకొల్పారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తెరకెక్కించారు.

👉సాంకేతికతను పరిచయం చేసి..

♦️కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతను, జానర్లను పరిచయం చేశారు. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్లకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే. వీటితో పాటుగా పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ చిత్రాలున్నాయి. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాల్లో నటించారు. మూడు షిఫ్టులు చొప్పున వేగంగా సినిమాలు పూర్తి చేసేవారు.

👉సినిమాల్లోకి ఇలా..

♦️బీఏ చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం, ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని కృష్ణ నిర్ణయించుకున్నారు. అలా తండ్రిని వద్ద తన కోరికను వ్యక్తం చేసి.. ఆయన అనుమతితో చైన్నైకి చేరుకున్నారు. తాను ఆశించిన స్థాయిలో ప్రజాదరణ సాధించగలిగారు. కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవి. అతను అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు 30వేల మంది అభిమానులు స్వచ్ఛందంగా 400 బస్సుల్లో తరలివచ్చారంటే ఆయనకున్న క్రేజ్‌ ఎంటో తెలిసిపోతుంది. సూపర్‌ స్టార్‌కు ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం (1997), ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2003), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (2008), పద్మభూషణ్ పురస్కారం (2009) వరించాయి. 1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యునిగా గెలుపొందాడు.

👉కుటుంబం..

♦️కృష్ణ కుటుంబం నుంచి కుమారులు మహేష్ బాబు, రమేశ్‌ బాబు, కుమార్తె మంజుల, చిన్న అల్లుడు సుధీర్ బాబు సినిమా రంగంలోకి వచ్చారు. తోటి నటి అయిన విజయనిర్మలను 1969లో ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్నారు. కుమారుడు మహేశ్‌ బాబు పలు విజయాలు అందుకుని ప్రేక్షకుల నుంచి సూపర్ స్టార్ అన్న తండ్రి బిరుదు పొందాడు. విజయ నిర్మల అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించిన మహిళా దర్శకులిగా నిలిచింది. 2010 దశకంలో కృష్ణ నటన నుంచి, రాజకీయాల నుంచి విరమించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh