సీనియర్ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకన్న కేసీఆర్.. ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. ఇక, కృష్ణ అంత్యక్రియలను బుధవారం నిర్వహించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ప్రస్తుతం నానక్‌రామ్ గూడలోని నివాసంలో కృష్ణ భౌతికకాయాన్ని ఉంచారు. అక్కడ పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. సినీ ప్రముఖులు చిరంజీవి, పవన్ కల్యాణ్, రాఘవేంద్ర రావు, వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. , తెలంగాణ మంత్రి కేటీఆర్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. తదితరులు కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు.
ప్రముఖల సందర్శన కోసం కొన్ని గంటల పాటు కృష్ణ భౌతికకాయాన్ని నానక్‌రామ్‌గూడలోని నివాసంలోనే ఉంచనున్నారు. ఇంట్లో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం.. అభిమానుల సందర్శన కోసం గచ్చిబౌలి స్టేడియానికి కృష్ణ భౌతికకాయం తరలించనున్నారు. సాయంత్రం నుంచి కృష్ణ భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక, బుధవారం ఉదయం పద్మాలయ స్టూడియోస్‌కు కృష్ణ భౌతికకాయాన్ని తరలించనున్నారు. అక్కడ కొన్ని ఆచార కార్యక్రమాలు పూర్తయ్యాక.. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టుగా కృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు.
కృష్ణ మృతికి సంతాపంగా రేపు సినీ పరిశ్రమ కార్యకలాపాలు, షూటింగ్‌లు నిర్వహించవద్దని తెలుగు ఫిలిం ఛాంబర్ విజ్ఞప్తి
రేపు తెలుగు ఇండస్ట్రీ బంద్ సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడవటంతో.. తెలుగు ప్రేక్షకులు శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణ మృతికి సంతాపంగా రేపు సినీ పరిశ్రమ కార్యకలాపాలు, షూటింగ్‌లు నిర్వహించవద్దని తెలుగు ఫిలిం ఛాంబర్ విజ్ఞప్తి చేయగా.. రేపు పరిశ్రమను మూసివేస్తున్నట్లు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది.