Lakshmi: లక్ష్మీ దేవి పుట్టుకకు కారణం ఏంటి ?

లక్ష్మీ దేవి పుట్టుకకు కారణం ఏంటి?

శ్లోకం:లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం| దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం||; శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం, | త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం||

రెండు చేతులలో మాలలను ధరించి, అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమహాలక్ష్మిీ రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మీ సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మీ. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తి త్రయంలో మధ్య శక్తి. మహాలక్ష్మీని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా అంటే అన్ని జీవలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీసప్తసతి చెబుతోంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి.

ప్రతీ దేవుడికి, దేవతకు వారి పుట్టుక వెనుక ఏదో ఒక ప్రాముఖ్యత, బలమైన కారణాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే హిందువులు అందరూ ఎంతో ఇష్టపడి, అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే లక్ష్మీ దేవి పుట్టుక వెనుక కూడా ఓ కథ ఉంది. లక్ష్మీ దేవికి ఆ పేరు లక్ష్య అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. అష్ట ఐశ్వర్యాలకు, సిరి సంపదలకు, విజయానికి లక్ష్మీ దేవీ పెట్టింది పేరు. లక్ష్మీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు, సుఖశాంతులతో పాటు చేసే పనిలో విజయం వరిస్తుందని పురాణేతి హాసాలు చెబుతున్నాయి.

అమ్మలగన్న అమ్మ దుర్గా దేవి కూతురు లక్ష్మీ దేవి. అందుకే దుర్గమ్మను అమ్మలగన్న అమ్మ అని కొలుస్తుంటారని ప్రతీతి. మహా విష్ణువుకి లక్ష్మీ దేవి సతీమణి. విష్ణువు ఏ జన్మలో ఏ అవతారం ఎత్తినా… ఆ అవతారంలో మరో వేషంలో మారుపేరుతో ఆయన వెన్నంటే ఉంటూ వచ్చిన లక్ష్మీ దేవి గురించి తెలుసుకోవాలంటే ముందుగా క్షీరసాగర మధనం గురించి, ఆమె విష్ణుమూర్తి చెంతకు ఎలా చేరిందనే విషయాలు తెలుసుకోవాలి.ఒకసారి దేవేంద్రుడి రాజ్యమైన అమరావతికి వచ్చిన దుర్వాస మహర్షి అక్కడ ఇంద్రుడికి ఓ విలువైన, పవిత్ర హారాన్ని బహుమతిగా అందిస్తాడు. అయితే ఆ హారాన్ని తీసుకున్న ఇంద్రుడు దానిపై అంత ఆసక్తి లేనట్టుగా తన వద్ద ఉన్న ఐరావతానికి ఇస్తాడు. ఇంద్రుడు ఇచ్చిన హారాన్ని నేలమీదేసి తొక్కేస్తుంది ఆ ఐరావతం. అది తనకు ఎంతో అవమానంగా భావించిన దుర్వాస మహర్షి.. ఇంద్రుడిపై కోపంతో శపిస్తాడు. ఏ రాజ్యభోగాలైతే చూసి మిడిసిపడుతున్నావో అవి లేకుండాపోవుగాక అని ఇంద్రుడికి శాపం పెట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.దుర్వాస మహర్షి శాపం మూలంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి రాజ్యం అమరావతిలో క్రమక్రమంగా కష్టాలు మొదలవుతాయి. రాజ్యంలో సుఖశాంతులు కరువై ప్రజలు అష్టకష్టాలపాలవడం స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో రాక్షసులు కూడా ఇంద్రుడి అమరావతిపై దండెత్తి ఇంద్రుడిపై విజయం సాధిస్తారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని దేవేంద్రుడు దేవుళ్లందరినీ తీసుకుని విష్ణు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటాడు. రాక్షసుల అరాచకాలు చెప్పుుకుని పరిష్కారం సూచించాల్సిందిగా వేడుకుంటాడు…దేవేంద్రుడి మొర ఆలకించిన విష్ణువు… సముద్రంలో క్షీరసాగర మధనం చేయాల్సిందిగా సూచిస్తాడు. దేవుళ్లు, రాక్షసులు చెరోవైపు చేరి చేసే క్షీరసాగర మధనంలోంచి వచ్చే అమృతం ఎవరు సేవిస్తే వారిని విజయం వరిస్తుందని చెప్పి పంపిస్తాడు. విష్ణువు సూచన మేరకు దేవుళ్లు-రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మధనం కూడా మరో యుద్ధ సన్నివేశాన్ని తలపించినట్టు పురాణాలు చెబుతున్నాయి. క్షీరసాగర మధనం చేసే క్రమంలోనే సముద్ర తరంగాల మధ్యలోంచి ఓ తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీ దేవి ప్రత్యక్షమవుతుంది. ఆమె ఇంద్రుడివైపున్న దేవుళ్లను సమర్ధిస్తూ విష్ణువు చెంతకు చేరుతుందని, అలా క్షీరసాగర మధనంలోంచి జనించిన లక్ష్మీ దేవి ఆశీస్సులతో ఇంద్రుడు రాక్షసులపై పై చేయి సాధించి తిరిగి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడని పురాణాల్లోని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. పురాణాల ప్రకారం లక్ష్మీ దేవి పుట్టుకకు ఇది ఒక కారణంగా ఇతిహాసాలను అవపోసన పట్టిన పండితులు చెబుతుంటారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh