Navarathri: నవరాత్రులలో నాలుగోవ రోజు అమ్మవారు లలితాదేవిగా దర్శనం.

శ్లోకం: ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం, బింబాధరం పృథులమౌక్తిక శోభినాసమ్‌; ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం, మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్‌!

త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవీ ఉపాసకులకు ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో నాలుగోవ రోజున దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా కొలువుదీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యా స్వరూపిణి. మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసినీ పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి.
జగన్మాత ఆవిర్భావాన్ని గురించి మన పురాణాల్లో ఎన్నో గాధలున్నాయి . సప్తశతి రెండవ అధ్యాయంలో ఆమె అవతార గాధ అనేక సంకేతార్ధాలలో కానవస్తుంది . దేవదానవుల యుద్ధం నూరేళ్ళపాటు సాగింది . ఆ యుద్ధంలో దేవతలు పరాజితులయ్యారు . నిలువ నీడలేని వారు త్రిమూర్తుల నాశ్రయించారు . ||| స్థితికారకుడైన శ్రీ మహా విష్ణువు దేవతల దుస్థితిని చూసి కోపించాడు . అతని ముఖం నుండి క్రోధం వెలువడి , కొద్ది సేపట్లో మహోజ్వలంగా వెలగసాగింది . ఆ మహాద్భుత శక్తిని చూచి , బ్రహ్మ రుద్రులు తల్లడిల్లి పోయారు . శృతిలయ శక్తులు జ్వాలారూపంలో వెలువడ్డాయి . తమ అంతశ్శక్తి తేజోరూపంలో బహిర్గతం కావడంతో త్రిమూర్తులు శక్తిహీనులయ్యారు . కాని కోపొక్తులుగా వున్నారు .

త్రిమూర్తుల నుండి వెలువడిన తేజశ్శక్తి , అగ్ని పర్వతంలా విజృంభించి , సమస్త విశ్వాన్ని ఆక్రమించింది . ఆ చిచ్చక్తి మాతృరూపం దాల్చింది . మహామాత తేజఃపుంజాలు లోకమంతటినీ కాంతిమంతం కనిపించాయి . దేవతలు ముగ్ధులై లోకమాత నవలోకించి ‘ హే జగజ్జననీ ‘ అంటూ కేలుమోడ్చారు ! వాత్సల్యపూర్ణమైన ఆమె ప్రసన్నవదనం నిరాశా నిస్పృహలను పటాపంచలు చేసింది . ” త్రిమూర్తుల దివ్యశక్తులను పుణికి పుచ్చుకొని ఆవిర్భవించిన జగన్మాత ఇచ్చాశక్తి , జ్ఞానశక్తి , క్రియాశక్తి స్వరూపిణిగా , త్రిగుణాత్మికగా స్తుతింపబడింది . పరమేశ్వరుని శుద్ద మంగళ స్వరూపం ఆమె ముఖంలో వికసించి , ఆ తల్లి శుద్ధ మంగళ స్వరూపిణీ అయ్యింది . ఆమె అనంత బాహువులు విష్ణువు యొక్క మహాశక్తి సంకేతాలయ్యాయి . విశ్వస్థితి కారకములగు బాహువులు విష్ణువు యొక్క మహాశక్తి సంకేతాలయ్యాయి . విశ్వస్థితి కారకములగు ఆ హస్తములు శిష్టరక్షణకు ప్రతీకలు . పూర్ణచంద్ర స్వరూపముగల ఆమె స్తనద్వయం మానవునికి అవసరమైన భౌద్దిక , ఆధ్యాత్మిక క్షీరపానమును సమకూర్చుచున్నాయి . ఆమె పాదద్వయం బ్రహ్మ స్పష్టశక్తి సంకేతం అనంత చలనము సూచించు జీవచైతన్యం . ఆమె త్రిలోచన ; సూర్యచంద్రాగ్నులు ఆమె త్రినేత్రాలు ; ఒక కన్ను విశ్వ జీవనాధారం . మరొకటి విశ్వసౌందర్య పత్రిక . ఆమె కనుబొమలు ఉదయ సంధ్య సంకేతాలు . త్రిశక్త్యాత్మికా , విశ్వస్వరూపిణీ , జగజ్జననీ ఆమెయే . చండీ , దుర్గా , కాళీ , మహాకాళీ , మహాలక్ష్మీ , మహాసరస్వతి ఆమెయే . ఆమెయే బాల , లలితా , రాజరాజేశ్వరీ , త్రిపుర సుందరి . మహాశివుడు తన త్రిశూలంతో మరొక త్రిశూలాన్ని నిర్మించి ఆమెకిచ్చాడు . త్రిశూలం దైహిక , మానసిక , ప్రాపంచిక ప్రవృత్తులను అణిచి , ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించు కేతం . విష్ణువు తన ధర్మచక్రం నుండి మరొక చక్రాన్ని సృష్టించి ఇచ్చాడు . జగత్తు యొక్క అనిర్భాధిత చలనానికి ప్రతీక చక్రం . ప్రజాపతి అక్షరమాలనిచ్చాడు . శ్రీ మాత అకారాది క్షకారాంత వైఖరీ వాగ్స్వరూపిణీ అయింది . జగచ్చక్షువైన సూర్యుడు తన ప్రకాశాన్ని ఆమెకు సమర్పించాడు .

శ్రీ మాత అకారాది క్షకారాంత వైఖరీ వాగ్స్వరూపిణీ అయింది . జగచ్చక్షువైన సూర్యుడు తన ప్రకాశాన్ని ఆమెకు సమర్పించాడు . సముద్రుడు కమలహారాన్ని , కుబేరుడు పానపాత్రను అర్పించాడు . ఆ కానుకలన్నింటినీ స్వీకరించిన లోకమాత నవ్వింది . ఆ నవ్వు దానవ సమూహాన్ని కంపితం చేసింది . ఆమె దరహాస వదన దర్శనంతో దేవతా సమూహం ఆనందోత్సాహంతో నృత్యం చేస్తూ విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ , విరాగిణీ ప్రగల్భా , పరమోదారా పరమోదా మనోమయా ..అంటూ ప్రస్తుతింపసాగింది . ౧ ఈ రీతిగా అవతరించిన దేవి — జగన్మాత అయిన దుర్గా దేవి , మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమునే ఒక్కో రోజు ఒక్కొక్క రూపము ( అవతారము ) లో మహిషాసునితో యుద్ధము చేసిందా శక్తిస్వరూపిణి .
లోకకల్యాణార్థం దేవతల కోరిక మేరకు చిదగ్నికుండం నుంచి ఆవిర్భవించిన లలితాదేవి స్వరూప స్వభావాలు సాటిలేనివి . ఆమె సౌందర్యం లోకోత్తరం . వశిని , కాళిని , జయిని , మోదిని , అరుణ , విమల , సర్వేశ్వరి , కామేశ్వరి అనే పేర్లు గల వాగ్దేవతలు నిరంతరం ఆ తల్లి పద సన్నిధానంలోనే ఉండి , ఆమెను అర్చించుకుంటూ ఉంటారు . అమ్మ స్వరూపస్వభావాలు , దైనందిన కార్యక్రమాలు , అమ్మ సాగించే అద్భుత సన్నివేశాలు , అమ్మ దివ్యలీలలు , అనంత వ్యాపకమైన మహిమా విశేషాలు , అమ్మ అతిలోక సౌందర్య వైభవాలు – అన్నీ స్పష్టంగా , అతి సన్నిహితంగా వారికి దర్శనమిస్తాయి . లలితాదేవి శ్రీచరణ సన్నిధిలో పరవశించే ఈ దేవతలు తమ పరస్పర సంభాషణల్లో అమ్మ వైభవాన్ని కీర్తిస్తూ ఉంటారు . వారు వాగ్దేవతలు కనుక సింధువంతటి భావాన్ని బిందువుగా క్లుప్తీకరించి చెప్పగలరు . వశిన్యాదులు పొందిన ఈ దర్శనాన్ని హయగ్రీవుడు కూడా పొందగలిగాడు . తన వద్దకు చేరి , ఆర్తితో అడిగిన అగస్త్యమహర్షికి హయగ్రీవుడు ఈ తత్త్వాన్నే వివరించాడు . వశిన్యాది వాగ్దేవతల దర్శనాన్ని ,హయగ్రీవుని సందర్శనాన్ని బ్రహ్మాండపురాణం ఆధారంగా , శ్రీలలితా సహస్రనామ స్తోత్రం పేరిట వ్యాసమహర్షి మానవాళికి అనుగ్రహించారు . ఆ స్తోత్రంలో మాతృప్రేమలోని సహజసిద్ధమైన మాధుర్యాన్ని ఆవిష్కరించారు . ఆ తల్లి స్వభావమే అంతటిదని కీర్తించారు . ఆ విశ్వజననిని ‘ స్వభావమధుర ’ అని పేర్కొన్నారు . సాటిలేని మాధుర్యాన్ని తన స్వభావంలో నింపుకున్న లలితాదేవి స్వరూపం ఎలాంటిది ? కరచరణాది అవయవాలు ధరించి నిండైన మాతృప్రేమకు ప్రతిరూపంగా ఆ తల్లి సాక్షాత్కరిస్తే ఎలా ఉంటుంది ? ఆ అంశాన్ని వ్యాసులవారు రమణీయంగా చిత్రించారు . శ్రీలలితాదేవిని శ్రీమాతగా దర్శించిన మనం , ఆమెను ‘ శ్రీమహారాజ్ఞి’గా భావన చేద్దాం.

విశ్వసామ్రాజ్య పాలనాభారాన్ని నిర్వహించే తల్లి శ్రీలలితాదేవి .అనంత వైవిధ్యం గల ఈ సృష్టిలో ఎవరెవరికి ఏ విధమైన ఆహారపానీయాలు……

అందించి పోషణ సాగించాలో , రక్షణ కల్పించాలో ఆ విధమైన పద్దతులలో వారివారికి సుఖశాంతులను కలిగించే ఆ తల్లి ‘ శ్రీమహారాజ్ఞి’లలితాదేవి ఒక దివ్య సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది . ఆ సింహాసనం ఆమె వైభవానికి సంకేతం . ఈ సృష్టి అంతా ఆమెకు సింహాసనమే . అందువల్ల లలితాదేవి ‘ శ్రీమత్ సింహాసనేశ్వరి . ‘ దేవతల కార్యం చక్కబెట్టడానికి ఆమె చిదగ్నికుండం నుంచి ఆవిర్భవించింది .

ఆ తల్లి ఆవిర్భవించబోతుండగానే ఆమె దివ్యతేజస్సు ముందుగా దర్శనమిస్తోంది . వెలుగులకే వెలుగైన ఆ దేవి తేజస్సు ఎలా ఉంటుంది ? కరచరణాది అవయవాలతో ఆమె సాక్షాత్కరించగానే వేయిమంది సూర్యులు ఒక్కసారి ఉదయించినట్లుంది . తూర్చుదిక్కున సూర్యోదయం కంటే ముందుగా అరుణోదయం జరుగుతుంది . ఉదయించే సూర్యకాంతి అరుణవర్ణంలోనే ఉంటుంది . సూర్యుడు ఉదయిస్తూ ఈ ప్రపంచాన్ని మేలుకొల్పుతాడు . పద్మాలను వికసింపచేస్తాడు . ఒక్క సూర్యుడు ఉదయిస్తేనే ఇలా ఉంటుంది కదా ! మరి , వేయి సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే … ? వేయిమంది ఉదయసూర్యుల కాంతితో లలితాదేవి ఆవిర్భవిస్తూ , తన భక్తుల హృదయాలలోని అజ్ఞాన తిమిరాలను పటాపంచలు చేస్తుంది . వారిని ఆధ్యాత్మిక తత్త్వంలోకి మేలుకొల్పుతుంది . వారి హృదయపద్మాలకు వికాసం కల్పిస్తుంది . మధ్యాహ్న సూర్యుడు ఎంతో దేదీప్యమానంగా ఉంటాడు . కాని , తాపాన్ని కలిగిస్తాడు . ఉదయకాలపు సూర్యుడు నులివెచ్చదనాన్ని కలిగిస్తూ , సుందరంగా ఆహ్లాదకరంగా ఉంటాడు . ఉదయకాలపు సూర్యుడు నులివెచ్చదనాన్ని కలిగిస్తూ , సుందరంగా ఆహ్లాదకరంగా ఉంటాడు . ఆర్తులను ఆదరించే స్వభావం గల లలితాదేవి ఉదయకాలపు వేయిసూర్యుల కాంతితో ప్రకాశిస్తోంది . ‘ వేయి ‘ అంటే ‘ అనంతం ‘ , లెక్కలేనంతమంది సూర్యులు ఒక్కపెట్టున ఉదయిస్తే వెలువడే కాంతిపుంజమే లలితాదేవి స్వరూపం . చిదగ్నికుండం నుంచి ఆవిర్భవించిన లలితాదేవికి నాలుగు చేతులున్నాయి . ఆ నాలుగు చేతులూ నాలుగు దిక్కులు . విశ్వమే తానైన ఆ తల్లిని ఆరాధించడం అంటే విశ్వంలోని జీవరాసులందరి పట్ల అరమరికలు లేని ఆత్మీయతతో ప్రవర్తించడమే .

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh