KP Chowdary: కేపీ చౌదరిని పోలీసు కస్టడీకి అనుమతించిన రంగారెడ్డి కోర్టు
డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌదరిని రాజేంద్రనగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గోవా నుంచి మాదక ద్రవ్యాలను తరలిస్తూ పోలీసులకు చౌదరి పట్టుపడిన విషయం తెలిసిందే . ప్రస్తుతం చర్లపల్లి జైలులో 14 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న చౌదరిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని రాజేంద్రనగర్ పీఎస్‌కు తరలించారు. అయితే రెండు రోజులపాటు కస్టడీకి ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో పోలీసులు ఈరోజు కేపీ చౌదరిని చర్లపల్లి జైలు నుంచి రాజేంద్రనగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
అనంతరం రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలోనే అతడిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఇక కేపీ చౌదరి హైదరాబాద్ సిటీలోని ఓ పబ్బులో పార్టీలు నిర్వహిస్తూ, కొకైన్ సప్లయ్ చేసేవాడని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. పోలీసులు ఆ పార్టీల్లో పాల్గొన్నవారి జాబితాను తయారుచేసినట్టు తెలిసింది. ఆ జాబితాలో పలువురు ప్రముఖులున్నట్టు, వారికి నోటీసులు కూడా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
ఈ విచారణ సందర్భంగా డ్రగ్స్ వ్యవహారంలో కేసీ చౌదరికి సినిమా వాళ్లతో ఏమైనా లింక్స్ ఉన్నాయా? అనే దానిపై ఆరా తీయనున్నారు. ఇక, ఈరోజు, రేపు.. కేపీ చౌదరిని పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించనున్నారు. ఇక, గోవా నుంచి కేపీ చౌదరి 100 ప్యాకెట్ల కొకైన్ తీసుకురాగా, 90 ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 10 ప్యాకెట్లు ఎవరికి అమ్మరన్న దానిపై పోలీసుల దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
కాగా, చౌదరితో నిరంతర టచ్‌లో ఉన్న నలుగురు హీరోయిన్లు, ఇద్దరు ప్రొడ్యూసర్లపై పోలీసులు మెయిన్‌గా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అతడిని కస్టడీకి తీసుకుని విచారణ జరిపితే ఈ డ్రగ్ దందాకు సంబంధం ఉన్న వారి గుట్టు రట్టయ్యే చాన్సెస్ ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. గోవా, హైదరాబాద్‌లో ప్రైవేట్ పార్టీలు నిర్వహించిన కేపీ చౌదరికి సంబంధించిన 4 మొబైల్స్‌ను పోలీసుుల స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ 4 ఫోన్ల నుంచి కాల్ డేటా తీస్తున్నారు. ఇద్దరు హీరోయిన్లు, నలుగురు మహిళా ఆర్టిస్ట్‌లు.. ఒక డైరెక్టర్‌తో డ్రగ్స్ వ్యవహారంపై కేపీ చౌదరి చేసిన చాటింగ్‌ను గుర్తించారు. డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియన్ గాబ్రియేల్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కీలక అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉందని సమాచారం.