రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ శ్రేణుల దాడి కి రియాక్ట్ అయిన మాణిక్ రావు థాక్రే
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పాదయాత్రలో భాగంగా భూపాలపల్లిలో మంగళవారం రాత్రి బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ రెడ్డిపై కోడిగుడ్లతో, టమాటాలతో దాడి చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ కార్యకర్తలపై రాళ్లు దువ్వారు. దీనితో యాత్రలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక రేవంత్ రెడ్డిపై దాడిని కాంగ్రెస్ నేతలంతా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే రేవంత్ రెడ్డిపై దాడిని ఖండించారు. రేవంత్ రెడ్డి పై దాడి ఘటన బీఆర్ఎస్ దిక్కుమాలిన పాలనకు మరో నిదర్శనం అని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా థాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్యం పట్ల బీఆర్ఎస్ నిర్లక్ష్యానికి ఇది నిరూపణ అన్నారు. భౌతికదాడులు ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించిన ఆయన దాడులు చేయడం మంచిది కాదని హితవు పలికారు ఇదిలా ఉంటే తెలంగాణలో బలం పుంజుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పలు జిల్లాలను చుట్టేసిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి బీజేపీపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీపీసీసీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 8న కరీంనగర్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ ఈ సభకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సభలోనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాల గురించి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని తాము అధికారంలోకి వస్తే తెలంగాణలోనూ ఇదే రకంగా పథకాలను అమలు చేస్తామని చెప్పేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.
ఇది కూడా చదవండి :