విశాఖకు రిజర్వ్ బ్యాంక్

RBI OFFICE ESTABLISHED AT VIZAG

విశాఖకు రిజర్వ్ బ్యాంక్

ఏపీలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని అమల్లోకి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ సర్కార్.ఈ క్రమంలో అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్ని మిగతా రాజధానులు విశాఖ, కర్నూలుకు తరలించేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే హైకోర్టు వాటిని గతంలోనే అడ్డుకుంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే రాజధానిలో పెట్టాల్సిన ఓ కార్యాలయాన్ని అమరావతిలో కాదని హైదరాబాద్ నుంచి విశాఖకు తరలిస్తోంది.

ఇందులో భాగంగా ప్రస్తుతం అమరావతిలో ఉన్న ఆఫీసులతో పాటు విభజన తర్వాత కూడా హైదరాబాద్ లోనే ఉండిపోయిన పలు కార్యాలయాల్ని విశాఖకు, కర్నూలుకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో ఇప్పటికే హెచ్చార్సీతో పాటు లోకాయుక్త వంటి కార్యాలయాలు హైదరాబాద్ నుంచి కర్నూలుకు మారిపోయాయి. ఇదే క్రమంలో హైదరాబాద్ నుంచి అమరావతికి రావాల్సిన ఓ కీలక ఆఫీసు ఇప్పుడు విశాఖకు తరలిపోతోంది.

ఏపీ-తెలంగాణ విభజన తర్వాత కూడా పదేళ్లు రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అలాగే ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిలో రాష్ట్ర ఆర్ధిక శాఖ నిర్వహించే సమావేశాలకు ఆర్బీఐ అధికారులు హాజరవుతున్నారు. దీంతో ఏపీకి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం కేటాయించాలని వైసీపీ సర్కార్ ఎప్పటి నుంచో కోరుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు కాబోయే రాజధాని వైజాగ్ లో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు సర్వం సిద్దమవుతోంది. అయితే  విశాఖలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం అధికారులు ఇప్పటికే స్ధలాల్ని, భవనాల్ని ఏతికే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం కావాలని ఆర్బీఐ కోరుతోంది.

దీంతో రాష్ట్ర అధికారులు అలాంటి భవనం అన్వేషణలో ఉన్నారు. భవనం దొరికితే నెల రోజుల్లోనే కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ముందుగా 500 మందితో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. అనంతరం అదనపు సిబ్బందితో పాటు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రాజధానిలో కాకుండా ఇంకా రాజధాని కాని వైజాగ్ లో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారనే దానిపై మాత్రం ఆర్బీఐ నుంచి సమాధానం లేదు.

వాస్తవానికి ముంబైలో ఆర్బీఐ కేంద్ర కార్యాలయం ఉంటుంది. అలాగే రాష్ట్రాల రాజధానుల్లో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఇప్పటివరకూ ఉమ్మడి ఏపీ, విభజన తర్వాత ఏపీ, తెలంగాణ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్బీఐ దీన్ని తరలించాల్సి వస్తే ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతికే తరలించాల్సి ఉంటుంది. త్వరలో సీఎం జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెట్టేందుకు సిద్దమవుతున్నా సచివాలయం తరలింపు మాత్రం కష్టమే. సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకూ సచివాలయం అమరావతిలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని ఇంత హడావిడిగా వైజాగ్ లో ఏర్పాటు చేసేందుకు ఎందుకు సిద్ధమవుతోందన్న దానిపై పలు చర్చలు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh