ప్రపంచ దేశాలకు భారత్ దిక్సూచిలా మారేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటున్నాయి. భారతదేశం యొక్క విధానాలు మరియు నిర్ణయాలు ఇతర దేశాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉన్నాయి.
ప్రపంచ పెద్దన్నలా ప్రధాని మోడీ.. కీలక విషయల్లో ముందడుగు వేయడం.. పలు అంతర్జాతీయ సమస్యలను ప్రపంచ వేదికలపై ప్రస్తావించడం.. లాంటి పరిణామాలతో పెద్ద దేశాలు సైతం ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా సైతం మరికొన్ని కీలక అంశాల్లో భారత్‌తో దోస్తీకి ఉవ్విళ్లూరుతోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ప్రపంచ వేదికలపై ప్రధాని మోడీ (PM Modi) మేనియా మార్మోగుతోంది. మోడీతో మాట్లాడేందుకు.. భారత్‌తో దోస్తీకి ప్రపంచ నాయకుల ఉచ్చుకతే దీనికి నిదర్శనం.. ఈ క్రమంలో అమెరికా సైతం భారత్ తో సంబంధాలను మరింత మెరుగుపర్చేందుకు ఆసక్తిచూపుతోంది. భారతదేశం-అమెరికా సంబంధాల చరిత్రలో 2022 సంవత్సరం కీలకం కానుంది.. వచ్చే సంవత్సరం 2023లో దౌత్య సంబంధాలు అగ్రభాగాన ఉంటాయని స్వయంగా వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పడం ఆసక్తికరంగా మారింది. జో బైడెన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం భారత్ తో బంధాన్ని అత్యంత కీలక సంబంధాలలో ఒకటిగా చూస్తుందని వైట్‌హౌస్ కీలక అధికారి స్పష్టంచేశారు.
ఇండోనేషియాలోని బాలి ప్రావిన్స్‌లో ఇటీవల ముగిసిన G-20 సమ్మిట్ ముగింపులో విడుదల చేసిన ‘ఉమ్మడి ప్రకటన’ ఏకాభిప్రాయాన్ని ఏర్పరచడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషించినందుకు ప్రిన్సిపల్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జోన్ ఫైనర్ కూడా ప్రశంసించారు. ప్రెసిడెంట్ జోబైడెన్.. ప్రధాని మోడీ మధ్య జరిగిన చర్చలు దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. “యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ బిడెన్.. ప్రపంచవ్యాప్తంగా భాగస్వాముల కోసం చూస్తున్నప్పుడు.. అదేవిధంగా కష్టాల్లో సహాయపడే భాగస్వాముల కోసం వెతుకుతున్నప్పుడు.. గ్లోబల్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో నిజంగా సహాయపడింది భారతదేశమే.. ఆ జాబితాలో ప్రధాని మోడీ అగ్రభాగాన ఉన్నారు.” అని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన భారతీయ-అమెరికన్ల సమావేశంలో ఫైనర్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత సంతతికి చెందిన కీలక నాయకులు సహా.. ఇండో అమెరికన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జోన్ ఫైనర్ మాట్లాడుతూ.. “మేము G-20 సదస్సు సమయంలో చూశాము.. ఇక్కడ అన్ని దేశాల సమూహం మధ్య ఉమ్మడి ప్రకటన గురించి ఆలోచించాం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. అదేవిధంగా పనిలో ఏకాభిప్రాయాన్ని ఏర్పరచడంలో ఆయన పోషించిన పాత్ర కీలకం.. అణు సమస్యలకు సంబంధించి పెరుగుతున్న ప్రమాదాన్ని ఎత్తిచూపేందుకు భారత ప్రభుత్వం కృషి చేసింది” అని ఆయన పేర్కొన్నారు. అమెరికా-భారత్ సంబంధాలలో 2022 చాలా పెద్దది.. 2023లో సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నామని తెలిపారు. ఇదే అజెండాపై క్వాడ్ సమ్మిట్ రాబోతుందని.. వచ్చే ఏడాది G20 నిర్వహణ అధ్యక్ష భాద్యతలు తీసుకున్న భారత్ తో సంబంధాల కోసం ఎదురు చూస్తున్నామని ఫైనర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
అమెరికా – భారత్ మధ్య సంబంధాలపై ప్రధాని మోదీ, ప్రెసిడెంట్ బైడెన్ దాదాపు 15 సార్లు భేటీ అయ్యారు. తాజాగా బాలిలో జరిగిన జీ.20 సదస్సు.. ఇరు దేశాల సంబంధాలను మరింత బలపడేలా చేసింది. అక్కడ ప్రధాని మోడీ అనుసరించిన విధానం.. అగ్రరాజ్యాన్ని మరింత ఆకట్టుకునేలా చేసింది.