Hyderabad: దంచికొట్టిన వాన……నీళ్లల్లో ఆగిన సిటీ బస్సు

Hyderabad

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన……నీళ్లల్లో ఆగిన సిటీ బస్సు

Hyderabad: హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. శనివారం తెల్లవారు జామున వాతావరణం ఒక్కసారిగా చల్లబడంతోపాటు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సుమారు రెండు గంటలకుపైగా ఎడతెరిపిలేకుండా భారీవర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా కుండపోత వర్షం కురియడంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. ఇప్పటికే వారం రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని రహదారులపై వర్షపునీరు నిలిచిఉంది. తాజాగా కురిసిన వర్షంతో రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరుతుండటంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ క్రమంలోనే Hyderabad సిటీ శివార్లలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కిందకు భారీగా వరద నీరు వచ్చింది చేరింది. నీటి ప్రవాహాన్ని అంచనా వేయలేని ఆర్టీసీ సిటీ బస్సు డ్రైవర్.. అదే వేగంలో ముందుకొచ్చేశారు.

సరిగ్గా బ్రిడ్జి కిందకు రాగానే ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి.. బస్సు సగం మునిగిపోయింది. ఇంజిన్ లోకి నీళ్లు వెళ్లటంతో బస్సు ఆగిపోయింది. బ్రిడ్జి మధ్యలో బస్సు ఆగిపోవటం.. బస్సులోకి నీళ్లు రావటంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. వెంటనే బస్సులో నుంచి బయటకు దిగి.. నడుంలోతు నీటిలో నడుస్తూ బయటకు వచ్చారు.

బస్సు డ్రైవర్ నీటి లోతును అంచనా వేయకపోవటం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తుంది. ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. రెండు గంటలు పడిన కుండపోత వానకు సిటీలోని చాలా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

Hyderabad నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ మూడు రోజులుపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. బయటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు, వడగండ్లతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని , కొన్ని జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్లతో కూడిన భారీ వర్షం పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh