ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ప్రజా యుద్ధనౌక గద్దర్‌పై తన హయాంలో జరిగిన కాల్పులకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. గద్దర్ పై కాల్పులు జరపమని ఎవరినీ తాను ఆదేశించలేదని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఓ వర్గం టీవీ.. మీడియాలు తనను ఈ విషయంలో ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నాయని.. వాస్తవాలు ఏమిటో 1997లో విధుల్లో ఉన్న పోలీసులకు తెలుసునని చంద్రబాబు అన్నారు.
77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు జాతీయ జెండా ఆవిషరించగా.. అనంతరం ఆయన అల్వాల్ లోని గద్దర్ నివాసానికి వెళ్లి.. ఆయన కుటుంబ సభ్యులను పలకరించారు. పార్టీ పరంగానే కాకుండా.. వ్యక్తిగతంగా కూడా ఈ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని బాబు హామీ ఇచ్చారు. 1997లో గద్దర్ పై కాల్పులు జరిగిన ఘటనపై చంద్రబాబు ఈ సందర్భంగా స్పందించారు.
నాటి కాల్పుల ఘటనకు సంబంధించి ఇటీవల కొందరు తనపై తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పుల ఘటన తర్వాత గద్దర్.. తనతో అనేక సార్లు మాట్లాడారని చెప్పారు. తమ మధ్య స్నేహం అలానే కొనసాగిందన్నారు. హైదరాబాద్‌లో ఉంటే.. గద్దర్ తరచుగా వచ్చి కలిసి మాట్లాడేవారని తెలిపారు. గద్దర్‌కు తనకు అనేక విషయాల్లో పోలికలుఉ ఉన్నాయని చంద్రబాబు చెప్పారు.
తన లక్ష్యం, గద్దర్ లక్ష్యం ఒక్కటేనని చంద్రబాబు అన్నారు. పేదల హక్కుల పరిరక్షణకోసమే అటు గద్దర్, ఇటు తాను జీవితాలను అంకితం చేశామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పోటీచేస్తుందన్న చంద్రబాబు.. హైదరాబాద్ అభివృద్ధికి కారణం ఎవరో అందరికీ తెలుసన్నారు. హైదరాబాద్ అభివృద్ధి ఫలాలు తెలంగాణలో ప్రతి ఒక్కరకీ అందుతున్నాయని చంద్రబాబు అన్నారు.