Akhila priya: అఖిలప్రియ ముందే ఏవీ సుబ్బారెడ్డిపై దాడి , చున్నీ లాగారని సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ ఫిర్యాదు
Akhila priya: నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, టీడీపీ సీనియర్ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో భూమా అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటికే ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు ఆళ్లగడ్డలో అదుపులోకి తీసుకుని నంద్యాలకు తరలించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. ఏబీ సుబ్బారెడ్డిపై దాడితో యువగళం పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ దాడిలో ఏబీ సుబ్బారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. నారాలో లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నంద్యాలలో కొనసాగుతోంది.
Also Watch
భూమా అఖిలప్రియ అరెస్ట్‌తో నంద్యాలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అఖిల ప్రియ తన బిడ్డతోనే పాణ్యం పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
ఆమెతోపాటు భర్త భార్గవ్ రామ్, పీఏ మోహన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఏవీ సుబ్బారెడ్డిపై కూడా అఖిలప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అందరిముందే ఆయన తన చున్నీ పట్టుకుని లాగినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు అఖిల ప్రియ అరెస్ట్‌తో ఆళ్లగడ్డ పట్టణంలో అఖిల ప్రియ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించి అరెస్ట్ చేశారు.
అలాగే ఏవీ సుబ్బారెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.నారా లోకేష్ యువగళం పాదయాత్ర శ్రీశైలం నియోజకవర్గంలో ముగిసింది.
నంద్యాల నియోజకవర్గంలో ఎంట్రీ సందర్భంగా టీడీపీ నేతలు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. భూమా అఖిల ప్రియ వర్గం.. ఏవీ సుబ్బారెడ్డి వర్గాలు పోటాపోటీగా స్వాగతం పలికేందుకు రెడీ అయ్యాయి.
ఈ క్రమంలో అఖిల ప్రియ అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశాడు. వెంటనే స్పందించిన టీడీపీ కార్యకర్తలు, పోలీసులు ఏవీ సుబ్బారెడ్డిని కారు ఎక్కించి అక్కడి నుంచి పంపించేశారు.