దేశంలో భారీగా పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

CORONA VIRUS: దేశంలో భారీగా పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. చాలా రాష్ట్రాల్లో గతం వారం కంటే ఈవారం కేసులు రెట్టింపుగా నమోదు అయ్యాయి. అయితే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ  తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 1,64,740 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 3,038 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,47,29,284కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,179 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు కొవిడ్‌ నుంచి 4,41,77,204 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలోఢిల్లీ, పంజాబ్‌, కేరళలో ఇద్దరు చొప్పున, జమ్మూ కశ్మీర్‌, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,30,901 కి చేరింది.

కరోనా ఇన్ఫెక్షన్ పాజిటివ్ కేసుల పెరుగుదల దృష్ట్యా, తమిళనాడు ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఫేస్ మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 1న రాష్ట్రంలో 123 మందికి కరోనా సోకింది. కర్ణాటకలో యాక్టివ్ కొవిడ్-19 కేసులు 1,400 మార్కును దాటాయి. మినీ థామస్ నివేదిక ప్రకారం మొత్తం కేసుల్లో 59 శాతం బెంగళూరులోనే నమోదయ్యాయి. ఏప్రిల్ 1న రాష్ట్రంలో 284 కొత్త కేసులు నమోదయ్యాయి.

గత ఏడు రోజుల్లో రెట్టింపు కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. కేరళలో కరోనా కేసుల సంఖ్య ఒక వారంలో 1333 నుండి దాదాపు 4000కి మూడు రెట్లు పెరిగింది. గోవా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ లలో కోరనా వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ రాష్ట్రాల్లో గత వారంతో పోలిస్తే ఈ వారంలో కరోనా కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. గత వారం హిమాచల్ ప్రదేశ్‌లో కరోనా కేసులు 409 నుండి 1200కి పెరిగాయి.
రెండో స్థానంలో మహారాష్ట్ర

మహారాష్ట్ర, గుజరాత్‌లలో గత కొన్ని వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే మహారాష్ట్రలో స్థిరంగా ఉండగా గుజరాత్‌లో తగ్గింది. మహారాష్ట్రలో ఈ వారం కరోనా కేసుల సంఖ్య 3323, ఇది గత ఏడు రోజుల్లో (1956 కేసులు) నమోదైన కేసుల కంటే 70 శాతం ఎక్కువ. అలాగే  హర్యానాలో పెరుగుతున్న కొవిడ్ -19 కేసులతో పాజిటివిటీ రేటు 4 శాతానికి చేరుకుంది. ఆరోగ్య శాఖ అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ కోరారు. నిన్న వైద్యారోగ్య శాఖ సీనియర్ అధికారుల సమావేశం కూడా జరిగింది. రాష్ట్రంలో శనివారం సాయంత్రం విడుదల చేసిన కొవిడ్-19 బులెటిన్‌లో 579 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఒక్క ముంబైలోనే 172 కేసులు నమోదు

మహారాష్ట్రలో దాదాపు 550 కేసుల్లో 172 కేసులు ఒక్క ముంబైలోనే నమోదయ్యాయి. ఏప్రిల్ 2వ తేదీన ముంబైలో మొత్తం 172 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారిక బులెటిన్‌లో తెలిపింది. అదే సమయంలో రోగుల కోలుకునే రేటు 98.2 శాతంగా ఉంది.

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh