Awards: తెలంగాణ పల్లెలకు 13 జాతీయ అవార్డులు,హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
Awards: తెలంగాణ పంచాయతీలు పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పలు అభివృద్ధి ఇతివృత్తంతో దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి చేతులమీదుగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మక జాతీయ Awards ను అందుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 46 ఉత్తమ అవార్డుల్లో 13 అవార్డులను తెలంగాణ కైవసం చేసుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల్లోని తొమ్మిది విభాగాల్లో అవార్డులకు ఎంపిక చేయగా ఎనిమిది విభాగాల్లో తెలంగాణ Awards ను సాధించడం విశేషమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ..’దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు ఈ Awards కోసం పోటీ పడగా అందులో కేవలం 46 గ్రామాలు మాత్రమే అవార్డులు దక్కించుకున్నాయి. ఇందులోంచి 13 అవార్డులు తెలంగాణకే వచ్చినయ్. అంటే ప్రకటించిన మొత్తం జాతీయ అవార్డుల్లో 30శాతం రాష్ట్రమే కైవసం చేసుకున్నది. ఈ 13 ర్యాంకుల్లోంచి కూడా నాలుగు ఫస్ట్ ర్యాంకులు తెలంగాణకే రావడం గొప్పవిషయం’ అంటూ హర్షం వ్యక్తం చేశారు.
ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో సోమవారం జరిగిన ‘పంచాయతీల ప్రోత్సాహకంపై జాతీయ సదస్సు – అవార్డుల ప్రదానోత్సవం’ కార్యక్రమంలో జాతీయ ఉత్తమ అవార్డులను, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకోవడంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును, కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులను సీఎం అభినందించారు.
నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2023
- ఉత్తమ బ్లాక్ (మండల) పంచాయతీ: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎల్.ఎం.డి (సెకండ్ ర్యాంకు),
- ఉత్తమ జిల్లా పంచాయతీలు: ములుగు జిల్లా (సెకండ్ ర్యాంకు),
- గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ (స్పెషల్ కేటగిరీ) ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కె. (థర్డ్ ర్యాంకు)
- కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీ పురస్కార్: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా (సెకండ్ ర్యాంకు)
- గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ (స్పెషల్ కేటగిరీ–నాన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్–సర్టిఫికెట్): సిద్దిపేట జిల్లా మార్కూక్ ఎర్రవెల్లి (ఫస్ట్ ర్యాంకు)
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2023
- ఆరోగ్యవంతమైన పంచాయతీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలం గౌతంపూర్ (ఫస్ట్ ర్యాంకు)
- తాగునీరు సమృద్ధిగా ఉన్న పంచాయతీ: జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల (ఫస్ట్ ర్యాంకు)
- సామాజిక భద్రతగల పంచాయతీ: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం కొంగట్‌పల్లి (ఫస్ట్ ర్యాంకు)
- స్నేహపూర్వక మహిళా పంచాయతీ: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం ఏపూరు (ఫస్ట్ ర్యాంకు)
- పేదరికరహిత, జీవనోపాధి పెంచిన పంచాయతీ: గద్వాల జిల్లా రాజోలి మండలం మందొండి గ్రామం (సెకండ్ ర్యాంకు)
- సుపరిపాలనగల పంచాయతీ: వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం చీమల్‌దారి (సెకండ్ ర్యాంకు)
- క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ: పెద్దపల్లి జిల్లా ఎలిగాడ్ మండలం సుల్తాన్‌పూర్ (థర్డ్ ర్యాంకు)
- స్వయం సమృద్ధ మౌలిక సదుపాయాలుగల పంచాయతీ: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్‌రావుపేట మండలం గంభీర్‌రావుపేట (థర్డ్ ర్యాంకు)