తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిలో పటిష్ట పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆ దిశగా పలు చర్యలు తీసుకున్న తెలంగాణ సర్కార్ ఇప్పుడు కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈమేరకు జంట నగరాల్లో 40 కొత్త పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసింది తెలంగాణ సర్కార్. అలాగే కొత్తగా 6 డీసీపీలను నియమిస్తూ ఉన్నతాధికారులు జీవో జారీ చేశారు. హైదరాబాద్‌లో 12 మంది ఏసీపీ డివిజన్లు ఏర్పాటు చేయగా సైబరాబాద్‌లో 3 డీసీపీ జోన్లు ఏర్పాటు చేశారు. ప్రతి జోన్‌కు మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు.
కొత్తగా 11 లాఅండ్ఆర్డర్, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లతో పాటు.. ప్రతి ఏరియాలో సైబర్ క్రైమ్, నార్కొటిక్ వింగ్ ఏర్పాటు చేశారు. కొత్తగా 2 టాస్క్‌ఫోర్స్ జోన్లు కూడా ఏర్పాటు చేశారు. సైబరాబాద్‌లో మేడ్చల్, రాజేంద్రనగర్ జోన్లు ఏర్పాటు చేశారు. రాచకొండలో మహేశ్వరం జోన్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో దోమలగూడ, సెక్రటేరియట్, ఖైరతాబాద్, వారసిగూడ, బండ్లగూడ, ఐఎస్ సదన్, గుడిమల్కాపూర్, మాసబ్‌ట్యాంక్, ఫిలింనగర్, మధురానగర్, బోరబండ మొదలగు కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. సైబరాబాద్‌లో మోకిల్లా, అల్లాపూర్, సూరారం, కొల్లూర్, జినోమ్ వ్యాలీ మొదలగు కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.