AP CM :ముఖ్యమంత్రి పర్యటనకు మొక్కలను తొలగిస్తున్న అధికారుల అత్యుత్సాహం
ఆంధ్రప్రదేశ్ లో ఏపీలోని డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆయన సంక్షేమ బాట వీడడం లేదు ప్రస్తుతం 2024 ఎన్నికలను టార్గెట్ చేస్తున్న ఆయన ప్రజలకు మరింత చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్ ఆసరా పథకంమూడో విడత నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. నేడు (శనివారం) ఏలూరు జిల్లా దెందులూరు వేదికగా ముఖ్యమంత్రి జగన్ ఈ నిధులను మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు.
నేడు (శనివారం) ఏలూరు జిల్లా దెందులూరులో ఆసరా సాయం పంపిణీ విడుదల నిమిత్తం ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా చెల్లింపు జరిగింది. నేడు మూడో విడత నిధుల విడుదలకు నిర్ణయంచారు. రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్ జమ చేయనున్నారు ఈ డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు ఏ అవసరానికైనా వాడుకోవచ్చని సీఎం జగన్ ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే .
అలాగే సీఎం జగన్ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 10.30 గంటలకు దెందులూరు చేరుకుంటారు. 10.50 – 12.35 బహిరంగ సభలో వైయస్ఆర్ ఆసరా ఆర్ధిక సాయాన్ని సీఎం జగన్ విడుదల చేయనున్నారు.ఈ సభకు ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న పంచాయతీ వార్డు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులను తరలించే బాధ్యతను జిల్లా అధికారులు పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. వీరికోసం 110 వాహనాలు వినియోగించనున్నారు. వీటితో పాటు వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, తాగునీరు తదితర ఖర్చులన్నీ పంచాయతీ నిధుల నుంచే వినియోగించాలని ఓ జిల్లా స్థాయి అధికారి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. గ్రామాల్లో పొదుపు సంఘాల సభ్యులు సభకు రాకపోతే డ్వాక్రా రుణాలిచ్చే సమయంలో ఇబ్బంది పడతారని కొందరు యానిమేటర్లు హెచ్చరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అవసరం లేకపోయినా సభాప్రాంగణానికి దూరంగా ఉన్న దాదాపు 40 తాటిచెట్లను నరికేశారు. గుండేరు డ్రెయిన్ నుంచి వచ్చే నీటితోపాటు సీతంపేట ఛానల్ పరిధిలోని ఆయకట్టు పొలాల నుంచి వచ్చే మురుగు నీరు కొల్లేరులోకి తీసుకువెళ్లే ప్రధాన మురుగు కాలువను అయిదు ప్రాంతాల్లో పూడ్చారు. వంతెనలు, దెందులూరులోని రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు హడావుడిగా శుక్రవారం వైకాపా జెండా రంగులు వేశారు. దెందులూరులో శనివారం దుకాణాలేవీ తెరవడానికి వీలులేదని అధికారులు శుక్రవారమే హుకుం జారీ చేశారు. శుక్రవారం నుంచే గ్రామంలో మూడు పాఠశాలలకు సెలవులిచ్చేశారు.