బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం.. పొంగులేటి, జూపల్లి సస్పెండ్

BRS Suspends Ponguleti  jupalli :బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం పొంగులేటి, జూపల్లి సస్పెండ్

బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సస్పెండ్ చేసినట్టుగా బీఆర్‌ఎస్ పార్టీ తెలిపింది. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.  ఇక, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఉమ్మడి  ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.  గత కొంతకాలంగా ఆయన పార్టీ మారతారనే ప్రచారం సాగుతుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు కూడా ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తోంది.

అయితే ఆయన  ఏ పార్టీలో చేరాలనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు.  అలాగే మరోవైపు కొల్లాపూర్ నియోజకవర్గానికి   చెందిన  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం పార్టీకి దూరంగా ఉంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డితో ఆయనకు విభేదాలు ఉండగా పలు మార్లు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన జూపల్లి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటి చేసిన బీరం హర్ష వర్దన్ రెడ్డి  చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత హర్షవర్దన్ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరారు.

ఈ క్రమంలోనే ఇరువురు నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో హర్షవర్దన్ రెడ్డిపై, బీఆర్ఎస్ నాయకత్వంపై జూపల్లి  కృష్ణారావు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి బీఆర్ఎస్ అధినాయకత్వం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు.

గత ముడేళ్లుగా బీఆర్ఎస్ అధినాయకత్వం తనను పట్టించుకోవటం లేదని పార్టీలో తన సభ్యత్వాన్ని కూడా రెన్యూవల్ చేయలేదని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో నిన్న (ఆదివారం) నిర్వహించిన పొంగులేటి ఆత్మీయ సమావేశానికి జూపల్లి తన అనుచరులతో కలిసి హాజరయ్యారు.

ఇక, కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి జూపల్లి కృష్ణారావు కూడా హాజరయ్యారు. ఇరువురు నేతలు కూడా సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే పొంగులేటి, జూపల్లిలపై చర్యలు తీసుకోకుండా పార్టీ నష్టం జరిగే అవకాశం ఉందని.. క్యాడర్‌లోకి కూడా తప్పుడు సంకేతం వెళ్లే అవకాశం ఉందని భావించిన బీఆర్ఎస్ అధిష్టానం. రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

మాజీ ఎంపీ పొంగులేటి ఆత్మీయ సమావేశo లో  సింగరేణి కార్మికులను చిన్నచూపు చూస్తున్నారని  తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన కూతురిని కాపాడుకునేందుకు రూ.కోట్లు వెదజల్లుతున్న సీఎం రిజర్వేషన్లపై పోరాడలేరా ? అని ప్రశ్నించారు. కేటీపీఎస్‌ ఉద్యోగులకు నాలుగేళ్లుగా పీఆర్‌సీ వర్తింపచేయడం లేదని మండిపడ్డారు. అధికార పార్టీ తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. ప్రరవర్తన మార్చుకోకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

అయితే అసలు బీఆర్ఎస్ పార్టీ తమ నాయకులను పార్టీ నుంచి పెద్దగా సస్పెండ్ చేయదనే ప్రచారం ఉంది. అసంతృప్తిగా ఉన్న నాయకులు వాళ్లంతట వాళ్లే వెళ్లిపోయేలా చేస్తుందనే ఆరోపణ ఉంది. 2018లో ముగ్గురు రెబల్స్ ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఎవర్నీ సస్పెండ్ చేయలేదని తెలుస్తోంది. డీ. శ్రీనివాస్ విషయంలోనూ ఆయనపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేయలేదు. ఆయనే స్వయంగా రాజీనామా చేసి, పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh