సూడాన్ లో సైన్యం, పారామిలటరీ దళాల మధ్య పోరు సాగుతుండటంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతను శుక్రవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది.
గత శనివారం నుంచి ప్రారంభమైన సూడాన్ ఘర్షణల్లో ఇంతవరకూ 350 మంది వరకూ మృతి చెందిన అనేకమంది గాయపడ్డారు. కాల్పులు, బాంబులు, రాకెట్ దాడులతో సూడాన్ హోరెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఈ అత్యున్నత స్థాయి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధానమంత్రి మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా, ఇండియాలో సూడాన్ రాయబారి బీఎస్ ముబారక్, ఈజిప్టు, రియాద్ రాయబారులు, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్, కేంద్రం విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ డాక్టర్ ఎ.సయూద్ తదితరులు పాల్గొన్నారు.
చాలా విచక్షణా రహితంగా జరుగుతున్న వార్ వంటి వాతావరణంలో భారతీయులతో సహా వేలమంది ప్రజలు ఆహారం గానీ, నీరు గానీ, మందులు గానీ లేకుండా అల్లాడుతున్నారు. దాదాపు 50 లక్షలమంది ఇళ్లలో విద్యుత్ సౌకర్యం లేదు. కమ్యునికేషన్స్ సంబంధాలు దెబ్బ తిన్నాయి.
ఈ ఘర్షణలో సంఖ్యాపరంగా ఎంతమంది భారతీయులు చిక్కుకున్నారనే దానిపై ఇంకా అస్పష్టత ఉంది. ఘర్షణలు పెరుగుతుండటంతో వేలాది మంది పౌరులు సూడాన్ రాజధాని ఖార్తూమ్ విడిచిపెట్టి వెళ్తున్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఏప్రిల్ 20న న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియా గెటెరెస్‌తో సమావేశమై సూడాన్‌లోని పరిస్థితులపై చర్చించారు. తమ మధ్య సూడాన్ పరిస్థితిపై అర్ధవంతమైన చర్చ జరిగిందని, జీ-20, ఉక్రెయిన్‌లో ఘర్షణలు కూడా చర్చించామని, అయితే ప్రధానంగా సూడాన్‌పై చర్చ జరిపామని జైశంకర్ తెలిపారు. సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులతో ఢిల్లీలోని తమ బృందం ఎప్పడికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు
అక్కడి పరిస్థితిపై తమ శాఖ ఎప్పటికప్పుడు భారతీయ ఎంబసీ నుంచి సమాచారాన్ని సేకరిస్తోందని, భారతీయుల భద్రతపై దృష్టి నిలిపిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ సమావేశంలో తెలిపారు. వారిని అక్కడినుంచి స్వదేశానికి తరలించే యత్నాలను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. తాను అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా దేశాల విదేశాంగ మంత్రులతో అప్పుడే మాట్లాడినట్టు ఆయన పేర్కొన్నారు.
వివిధ మార్గాల ద్వారా అక్కడి ఇండియన్స్ ని కాంటాక్ట్ చేయడానికి యత్నిస్తున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాఘ్చి ఆ తరువాత వెల్లడించారు. అలాగే గ్రౌండ్ సిచుయేషన్ ని బట్టి తరలింపు ప్రక్రియ ప్రారంభం కావచ్చునని ఆయన వివరించారు.