TENTH PAPER LEAK:టెన్త్ క్లాస్స్ పేపర్ లీక్ పై మంత్రి సబిత స్ట్రాంగ్ వార్నింగ్
రెండు రోజుల పాటు టెన్త్ క్లాస్స్ ప్రశ్న పత్రాలు వరుసగా సోషల్ మీడియాలో వైరల్ కావడంపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టెన్త్ క్లాస్ పేపర్ లీక్ పేరుతో విద్యార్ధులను గందరగోళపర్చే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడే వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఆమె హెచ్చరించారు.
టెన్త్ పేపర్ ఎగ్జామ్ నిర్వాహణలో అక్రమాలకు పాల్పడితే ఉద్యోగులను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరొక సారి హెచ్చరించారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో ఈ రోజు (బుధవారం)వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పరీక్షా పేపర్లు లీక్ కాలేదని విద్యార్థులు, తల్లి తండ్రులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ పరీక్షల విషయంలో తమ స్వార్ధ ప్రయోజనాలకై విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంకా మిగిలిన నాలుగు పరీక్షల నిర్వహణ విషయంలో మరింత కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీ లకు సూచించారు.
మిగిలిన 4 పరీక్షల నిర్వహణలో కఠిన చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. పరీక్షల నిర్వహణలో 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ లు, ఎలక్ట్రానిక్ ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించవద్దని, పరీక్షల విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టంచేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను పటిష్టంగా అమలు చేయడంతోపాటు జిరాక్స్ షాప్ లను మూసివేయించాలని అన్నారు. పరీక్షా పేపర్ల రవాణా విషయంలో మరింత భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.
అలాగే తమ రాజకీయ అవసరాల కోసం విద్యార్ధుల జీవితాలను ఫణంగా పెట్టవద్దని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజకీయ పార్టీలను కోరారు. బుధవారంనాడు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. పిల్లల భవిష్యత్తుపై బాధ్యత ఉన్న ఏ పార్టీ నేతలు కూడా ఇలా వ్యవహరించబోరని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వంపై పోరాటం చేయాలనుకుంటే వేరే అంశాలున్నాయన్నారు.
టెన్త్ క్లాస్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం ఎక్కడుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ అయిందని వైరల్ చేసిన ప్రశాంత్ రెండు గంటల్లో 144 ఫోన్ కాల్స్ చేసిన విషయాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు.