Madhya Pradesh : ఇండోర్ కూలిన ఘటనలో 35 చేరిన మృతుల సంఖ్య
ఇండోర్ నగరంలోని బాలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో బావి పైకప్పు కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారం ఉదయానికి 35కు చేరింది. గురువారం మధ్యాహ్నం శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు 40 అడుగుల లోతున్న మెట్లబావి పైకప్పు కూలి అందులో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 35 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 14 మంది గాయపడ్డారని ఇండోర్ జిల్లా కలెక్టర్ టి. ఇళయరాజా వెల్లడించారు. ఒకరి ఆచూకీ లభించలేదని, చికిత్స తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్లిపోయారని ఆయన తెలిపారు. మిస్సైన వ్యక్తి కోసం బావిలో గాలింపు కొనసాగుతోందని పేర్కొన్నారు.
గురువారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఆయన చెప్పారు. పటేల్ నగర్ ప్రాంతంలో ఈ పురాతన ఆలయాన్ని ఓ ప్రయివేట్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యాయి. స్థలాభావం కారణంగా కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావి పైకప్పుపై కూర్చున్నారు.
అయితే మందిరం పైకప్పు కూలిపోయింది. దీంతో భక్తులు బావిలో పడిపోయారు. కనీసం 50 మంది భక్తులు బావిలో పడిపోగా పదిమందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
నిచ్చెన సాయంతో భక్తులను బయటకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. 14 మందిని కాపాడారు. 35 మంది చనిపోయినట్లుగా అధికారులు నిర్ధారించారు. రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తోంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదులపై ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకుంటే ఈ విషాదం జరిగుండేది కాదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అటు, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడినవారికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటించారు. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.మరొకవైపు ఇండోర్ ఆలయంలో జరిగిన దుర్ఘటనపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Extremely pained by the mishap in Indore. Spoke to CM @ChouhanShivraj Ji and took an update on the situation. The State Government is spearheading rescue and relief work at a quick pace. My prayers with all those affected and their families.
— Narendra Modi (@narendramodi) March 30, 2023