YCP MLC Candidates:వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు….. ట్విస్ట్ ఇచ్చిన టీడీపీ
ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అక్కడ అన్ని పార్టీల్లో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిస్తున్నాయి అధికార, ప్రతిపక్షాలు అందుకే ఈ సారి గ్రాడ్యువేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ తరుపున పెనుమత్స సురేష్ కోలా గురువులు ఇజ్రాయిల్, మర్రి రాజశేఖర్, జయమంగల వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసు రత్నం అసెంబ్లీ కార్యాలయంలో నామినేషన్లు వేశారు. ఏపీ శాసన మండలిలో మార్చి చివరి వారంలో ఖాళీ కానున్న పలు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం మార్చి6న రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి.
శాసన మండలి సభ్యుడు చల్లా భగీరధ్ రెడ్డి పదవీ కాలం గతేడాది నవంబరు 2వ తేదీతో ముగిసింది. మరోవైపు ఈ నెల 29తో నారా లోకేశ్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద రావు, వరాహ వెంకట సూర్యనారాయణ రాజు పెనుమత్స, గంగుల ప్రభాకర్ రెడ్డిల పదవీకాలం ముగియనుంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖాళీల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 27న షెడ్యూల్ ను ప్రకటించింది.
మార్చి 14వ తేదీన ఉదయం 11 గంటలకు అసెంబ్లీ భవనంలో నామినేషన్ల పరిశీలన జరగనుంది. మార్చి 16వ తేది మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ ఉంటే ఈ నెల 23న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ భవనంలో పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే ప్రస్తుతం వైసీపీకి 150కి పైగా బలం ఉండడంతో ఏడు సీట్లు ఏకగ్రీవమే అవుతుంది. దీంతో ఎన్నిక లేనట్టే అని అంతా భావిస్తున్న సమయంలో టిడిపి ట్విస్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తున్నట్టు సమాచారం. పార్టీ అభ్యర్థిని పోటీకి దించాలని పార్టీ ముఖ్యనేతలతో అధినేత చంద్రబాబు చర్చిస్తున్నట్లు సమాచారం అందుతోంది. డీపీ అభ్యర్థి నిలిపే అంశంపై అందుబాటులో ఉన్న నేతలతో అత్యవసరంగా సమావేశమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఒక్కో స్థానంలో అభ్యర్థి విజయం సాధించాలంటే22 నుంచి 23 ఓట్లు అవసరం. ప్రస్తుతం టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే వారిలో నలుగురు టీడీపీకి దూరంగా వైఎస్సార్సీపీకి జై కొట్టారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గన్నవరం ఎమ్మెల్యే వంశీ వల్లబానేని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి అధికార పార్టీకి మద్దతు తెలిపారు. దీంతో టీడీపీకి 19మంది బలం మాత్రమే ఉంది. అయితే టీడీపీ వ్యూహం ఏంటంటే అభ్యర్థిని బరిలోకి దింపితే విప్ జారీ చేస్తే జంపింగ్ ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టొచ్చని భావిస్తోంది. విప్‌కు అనుగుణంగా ఓటు వేయాల్సి వస్తుంది. ఒకవేళ విప్‌ను ఉల్లంఘిస్తే ఎమ్మెల్యేలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చని టీడీపీ భావిస్తోందట. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడంపై టీడీపీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇది కూడా చదవండి :