షర్మిల అరెస్ట్ మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్న తల్లి
Y S Sharmila: వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎష్ షర్మిల ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లోటస్ పాండ్ లోని ఇంటి వద్ద నుంచి సిట్ కార్యాలయానికి వెళ్లడానికి బయలుదేరిన వైయస్ షర్మిలను తనను పోలీసులు రానివ్వట్లేదని ఆమె ఆరోపించారు.
ఈ రోజు ఉదయం ఆమె ఇంటివద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. తనను బయటకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారంటూ వారితో షర్మిల వాగ్వాదం చేశారు.
తనను అడ్డుకోబోయిన పోలీసులను ఆమె నెట్టివేశారు. ఎస్సై, మహిళా కానిస్టేబుల్ ను ఆమె చేతితో నెట్టేశారు. అనంతరం ఆమె నిరసన తెలిపారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమె అరెస్టు విషయాన్ని తెలుసుకున్న ఆమె తల్లి విజయమ్మ పోలీస్ స్టేషన్ కు వచ్చారు.
Y S Sharmila ను అరెస్ట్ చేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించడంతో ఆగ్రహించిన వైఎస్ విజయమ్మ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు.
పోలీసులు విజయమ్మను పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులను నెట్టుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన వైయస్ విజయమ్మ ఈ క్రమంలో మహిళా పోలీస్ పై చేయి చేసుకున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని తోసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. అయినా సాధ్యం కాకపోవడంతో ఆమె ఎదురుగా ఉన్న మహిళా పోలీసు చెంపపై కొట్టారు.
అయితే చివరకు పోలీసులు విజయమ్మను లోపలికి వెళ్లనివ్వకపోవడంతో కార్లోనే కూర్చొని ఆందోళన వ్యక్తం చేసిన వైయస్ విజయమ్మ పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.Y S Sharmila అరెస్ట్ విషయాన్ని తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలి వస్తున్నారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించడం వల్లే, ఆత్మరక్షణలో భాగంగా వైయస్ షర్మిల, వైయస్ విజయమ్మ చెయ్యి చేసుకున్నారని వారు చెబుతున్నారు. మరి పోలీసులపై దురుసుగా ప్రవర్తించినందుకు వైయస్ షర్మిలపై కేసు నమోదు చేసిన పోలీసులు, వైయస్ విజయమ్మ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది. ఆమెను బయటకు తీసుకు వచ్చేందుకు పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.