పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ కీలక నిర్ణయం
Telangana : తెలంగాణ ప్రభుత్వ పెండింగ్ బిల్లుల వ్యవహారంలో గవర్నర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయకపోవటం న్యాయ పరమైన వివాదంగా మారింది. దీని పైన ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం పంపిన బిల్లుల విషయంలో గవర్నర్ నిర్ణయం తీసుకోకపోవటం పాలనా పరంగా ఇబ్బందిగా మారుతోందని ప్రభుత్వం పిటీషన్ లో పేర్కొంది. ఇప్పుడు ఈ Telangana బిల్లుల పైన గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ రోజు (సోమవారం) రోజున దీనిపై విచారణ జరగనుంది. అయితే విచారణకు కొన్ని గంటల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్న పది బిల్లుల్లో మూడింటికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదముద్ర వేశారు. డీఎం ఈ వయసు విరమణ పెంపు బిల్లును గవర్నర్ తమిళ సై తిరస్కరించారు. పురపాలక చట్ట సవరణ బిల్లుపై వివరణ కోరారు. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీలపై సైతం గవర్నర్ వివరణ కోరారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, అడిషనల్ డైరెక్టర్, ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిటైర్‌మెంట్ ఏజ్‌ను 61 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసిన Telangana బిల్లుకు గవర్నర్ నో చెప్పారు.
మరో రెండు బిల్లులు పురపాలక చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్ వర్సిటీల బిల్లుపై వివరణ కావాలంటూ పెండింగ్‌లో పెట్టారు. పురపాలక సంస్థల్లో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఇంతకాలం ఉన్న మూడేళ్ళ గడువును నాలుగేళ్ళకు పెంచుతూ మున్సిపల్ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం.. తీసుకొచ్చింది. దీనిపై నిర్ణయం తీసుకునేముందు మరింత వివరణ అవసరమని గవర్నర్ తమిళసై అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను నెలకొల్పడానికి తీసుకొచ్చిన బిల్లుపై సైతం నిర్ణయం తీసుకునేముందు ప్రభుత్వం నుంచి వివరణ కావాలని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఒక బిల్లును పాస్‌చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపితే.. బిల్లుకు ఆమోదముద్ర వేయడం, రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం, పునఃపరిశీలనకు మళ్లీ శాసనసభకు పంపడం, సమ్మతిని నిలుపుదల చేయడం అనే నాలుగు మార్గాల్లో ఏదో ఒకదాన్ని మాత్రమే అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొంది. అలా చేయకుండా శాసనసభ బిల్లులు పాస్‌చేసి పంపితే చాలా కాలం పెండింగ్‌లో పెట్టటం రాజ్యాంగబద్ధమేనా? అని పిటిషన్‌లో ప్రశ్నించింది. విచక్షణాధికారాన్ని ప్రయోగించడమంటే అసెంబ్లీ పాస్‌చేసిన బిల్లులపై ఎలాంటి చర్య తీసుకోకుండా ఉండటం కాదని చెప్పింది.