Rahul Ghandi: రాహుల్‌ గాంధీపై మరో పరువు నష్టం కేసు

Rahul Ghandi

Rahul gandi: రాహుల్‌ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదైంది.

Rahul Ghandi : మోదీ ఇంటిపేరుపై పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూరత్ ట్రయల్ కోర్టు తీర్పును సెషన్స్ కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏప్రిల్ 14 వరకూ సూరత్ రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. రాముల్ పిటిషన్‌పై గురువారం వాదనలు పూర్తిచేసిన సూరత్‌ సెషన్స్‌ కోర్టుo తీర్పును రిజర్వులో ఉంచింది. ఏప్రిల్‌ 20న తీర్పు వెల్లడించనున్నట్టు పేర్కొంది. అంతకుముందు రాహుల్‌ తరఫు న్యాయవాది ఆర్‌ఎస్‌ చీమా వాదనలను వినిపించారు. ట్రయల్‌ కోర్టులో విచారణ పారదర్శకంగా జరగలేదని, గరిష్ఠ శిక్ష వేయాల్సినంత కేసు కాదని తెలిపారు.

‘సందర్భానుసారంగా సాగిన రాహుల్ ప్రసంగంలో పరువు నష్టం కలిగించేంత తీవ్రమైన వ్యాఖ్యలు లేవు.. భూతద్దంలో పెట్టి చూస్తే తప్పా.. ప్రాథమికంగా మన ప్రధానిని తీవ్రంగా విమర్శించే ధైర్యం చేసినందుకు ఆయనపై వ్యాజ్యం వేశారు’ అని ఆయన వాదించారు. అలాగే, ఫిర్యాదుదారుడి (పూర్ణేష్ మోదీ) భౌగోళిక అధికార పరిధిని లేవనెత్తిన చీమా.. రాహుల్ కోలార్‌లో ప్రసంగం చేశారని, వాట్సాప్‌లో అతడికి సందేశం వచ్చిందని చెప్పారు.

‘మీరు పంజాబీలు గొడవ పడేవారని, దుర్భాషలాడుతున్నారని ఎవరైనా అంటే నేను వెళ్లి పరువు నష్టం కేసు పెట్టవచ్చా? అలాంటి పదాలు గుజరాతీలు, ఇతర భాషా సమూహాలు, మతపరమైన సంస్థలు మొదలైనవాటి కోసం తరచుగా ఉపయోగిస్తాం.. ఉదయం 11:51 గంటలకు నా క్లయింట్ దోషిగా ప్రకటించబడ్డారు.. అరగంటలో అతనికి కఠినమైన, గరిష్ట శిక్ష విధించారు.. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్నామని ట్రయల్ కోర్టు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది.. నన్ను క్షమించండి, నేను బలమైన పదాలను ఉపయోగిస్తున్నాను కానీ న్యాయమూర్తిని తప్పుదారి పట్టించారు.. కఠినంగా ప్రవర్తించారు’ అని చీమా వాదించారు.

 

నవంబరు 2019లో ‘చౌకీదార్ చోర్’ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పారని, మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలను అదే ఏడాది ఏప్రిల్‌లో చేశారని గుర్తుచేశారు. ‘కాబట్టి నాకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిందని ఫిర్యాదుదారు చెప్పిన వివరాలపై న్యాయమూర్తి ఎలా ఆధారపడతారు’ చీమా ప్రశ్నించారు.

మరోవైపు సూరత్ కోర్టు రాహుల్‌‌కు రెండేళ్ల జైలుశిక్ష విధించడంతో ఆ వెంటనే ఆయనపై అనర్హత వేటు పడింది. దీనికి సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి సర్క్యులర్ జారీ అయింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత పడింది. సూరత్ కోర్ట్ తీర్పు ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలకు దిగింది. కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని సూరత్ కోర్ట్ ఆఫ్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దోషిగా తేల్చడంతో లోక్‌సభ సభ్యత్వం నుంచి అనర్హత వేటు పడింది.  ఢిల్లీలో ఆయన ప్రస్తుతం ఉంటోన్న ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయాలని లోక్‌సభ హౌజింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 22లోగా ఆయన తన బంగళాను ఖాళీ చేయాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. 2014 నుంచి రాహుల్ ఢిల్లీ 12 తుగ్లక్ లేన్ లోని ప్రభుత్వ బంగ్లాలో ఉంటున్నారు.

మరోప్రక్క రాహుల్ గాంధీ  పై మరో పరువు నష్టం కేసు నమోదైంది. సూరత్ ట్రయల్ కోర్టు తీర్పు అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. వీర్‌ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై సావర్కర్‌ మనవడు సత్యకి సావర్కర్‌ బుధవారం పుణేలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు.

Leave a Reply