Pawan Kaalyan : జనసేనాని ‘వారాహి’ యాత్రకు రంగం సిద్ధం.
Pawan Kaalyan :జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జూన్ 14వ తేదీన కత్తిపూడి జంక్షన్ నుంచి ‘వారాహి’ యాత్ర ప్రారంభిస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహార కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ మేరకు గుంటూరులో నాదెండ్ల మనోహర్ సోమవారం సాయంత్రం వారాహి యాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం,కాకినాడ అర్బన్ , కాకినాడ రూరల్, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, పి. గన్నవరం నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది.
ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ యాత్ర నిర్వహించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో తమ పార్టీ కి ఎక్కువగా బలం ఉంటుందని ఆ పార్టీ భావిస్తుంది.
అందుకే ఈ జిల్లాల్లో పవన్ కళ్యాణ్ యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రలో అన్ని వర్గాల ప్రజల్ని పవన్ కళ్యాణ్ కలిసేలా ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు.
అలాగే 12 నియాజకవర్గాల్లో 19 మంది సమన్వయకర్తలను నియామకం చేశారు. అన్నవరం నుంచి భీమవరం వరకు ఈ యాత్ర కొనసాగనుంది.
కేవలం ఎన్నికల కోసం మాత్రమే యాత్ర కాకుండా ప్రజల బాధలను దగ్గరగా తెలుసుకునేందుకు, వారితో మమేకం అయ్యేందుకు ఇదో చరిత్రలో నిలిచిపోయే యాత్ర కాబోతోందని జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, సమస్యలతో సతమతమవుతున్న బాధితులతో ప్రత్యక్షంగా చర్చిస్తూ యాత్ర సాగేలా ప్రణాళికను సిద్ధం చేశారు.
ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు ప్రజా వినతులు స్వీకరించి, స్థానికులు, రైతులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలతో పవన్ ప్రత్యేకంగా మాట్లాడతారు.
అలాగే వారాహి యాత్రలో భాగంగా వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలను, ప్రజలకు జరిగిన నష్టాలను ప్రజలకు పవన్ కళ్యాణ్ తెలియజేస్తారని పేర్కొన్నారు.
జగన్ పాపం పథకంగా పోలవరం ప్రాజెక్టు మారిందని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల కోసం పోలవరం ఎత్తును తగ్గించారని పేర్కొన్నారు.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రూ. 17,140 కోట్ల నిధులను పోలవరం ప్రాజెక్టు కోసం విడుదల చేసిందని గుర్తు చేశారు.
పోలవరం ఎత్తు తగ్గించారని స్వయంగా కేంద్రమే చెప్పిందన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే హడావుడిగా పోలవరం పర్యటనకు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.