CM KCR చంద్రబాబు కు దక్కలేనిది-సీఎం కేసీఆర్ కు దక్కుతుందా..?

CM KCR చంద్రబాబు కు దక్కలేనిది-సీఎం కేసీఆర్ కు దక్కుతుందా..??

టీఆర్ఎస్ అధినేత..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ ప్రకటనకు సిద్దమయ్యారు. విజయదశమి ఇందుకు ముహూర్తంగా ఖరారు చేసారు. దీంతో..ఇప్పుడు తెలంగాణలో వైఎస్ షర్మిల నాయకత్వంలోని వైఎస్సార్టీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు జాతీయ పార్టీలే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ కోసం ఏర్పాటైన టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా రూపాంతరం చెందనుంది. ఇందుకోసం సాంకేతికంగా కసరత్తు జరుగుతోంది.

అయితే, టీఆర్ఎస్ తీర్మానం – ప్రకటనతో జాతీయ పార్టీగా గుర్తింపు దక్కినట్లు కాదని..ఎన్నికల సంఘం దీనికి స్పష్టమైన నిబంధనలు తీసుకొచ్చింది.రాష్ట్ర విభజనతో టీడీపీ జాతీయ పార్టీగా ప్రకటించుకుంది. కానీ, ఇప్పటి వరకు అధికారికంగా జాతీయ పార్టీ హోదా దక్కలేదు. మరి..టీఆర్ఎస్ ఈ అనుభవాలను చూసిన తరువాత ఏం చేయబోతోందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక ప్రాంతీయ పార్టీగా పోరాడిన టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు జాతీయ పార్టీగా రూపాంతరం చెందబోతోంది.కొత్త పేరు, కొత్త అజెండాతో ముందుకొస్తోంది.

బీజేపీ– కాంగ్రెస్- కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికే జాతీయ పార్టీలుగా ఉన్నాయి. టీడీపీ జాతీయ పార్టీగా ప్రకటించుకుంది. ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తింపు ఇవ్వకున్నా.. అవి ఒకటికి మించిన రాష్ట్రాల్లో పోటీ చేస్తూ జాతీయ పార్టీగానే ప్రచారం సాగుతోంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జాతీయ పార్టీగా అధికారికంగా గుర్తించాలంటే కొన్ని నిబంధనలను రూపొందించింది.

జాతీయ పార్టీగా గుర్తింపు దక్కాలంటే…. దేశంలో కనీసం నాలుగు రాష్ట్రాల్లో 6శాతం ఓట్లను దక్కించుకోవాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో గానీ, లోక్‌సభ ఎన్నికల్లో గానీ పోలై చెల్లిన ఓట్లలో ఈ మేరకు ఓట్లు రావాలి. అంతేకాకుండా నాలుగు ఎంపీ సీట్లను కూడా గెలవాల్సి ఉంటుందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. మరో మార్గం పరిశీలిస్తే..లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో కనీసం రెండు శాతం స్థానాలు గెలవాలి.ఈ రెండుశాతం సీట్లు కనీసం మూడు రాష్ట్రాల నుంచి గెలిచి ఉండాలి.

అదీ కాకుంటే.. ఒక ప్రాంతీయ పార్టీగా కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొంది ఉండాలి. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ మూడో నిబంధన ప్రకారమే జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. ఇప్పుడు సీఎం కేసీఆర్ చివరి రెండు మార్గాల్లో తన పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ – చంద్రబాబును దాటిపోతారాఅంటే.. ఇక్కడ సాంకేతిక అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు దక్కాలంటే.. ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో కనీసం ఆరుశాతం ఓట్లు తెచ్చుకోవడంతోపాటు రెండు అసెంబ్లీ స్థానాలు గెలవాలి. లేకుంటే ఆరుశాతం ఓట్లు తెచ్చుకోవడంతో పాటు ఒక ఎంపీ సీటు గెలవాలి. అప్పుడే జాతీయ పార్టీగా ఒకే గుర్తు దక్కనుంది. ప్రస్తుతం దేశంలో గుర్తింపు పొందిన జాతీయ రాజకీయ పార్టీలు 8 ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్సీపీ, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ).

ఇందులో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ ఇటీవలే జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. ఇప్పుడు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీగా గుర్తింపు విషయంలో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటున్నారు.అందులో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే..కొత్త పార్టీ కాకుండా, టీఆర్ఎస్ నే బీఆర్ఎస్ గా మార్చాలని నిర్ణయించారు. దీని ద్వారా కొత్త సమస్యలు రావని భావిస్తున్నారు. పార్టీ పేరు మారినా, కారు గుర్తు తమకే కొనసాగుతుందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కొత్త పార్టీ అంటే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో…ఉన్న పార్టీ పేరునే మారుస్తూ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక, అధికారికంగా జాతీయ గుర్తింపు దక్కించుకోవాలంటే..అది కేసీఆర్ శక్తి సామర్ధ్యాలపైన ఆధార పడి ఉంది.

జాతీయ పార్టీ ఏర్పాటయ్యాక ప్రధానంగా తెలంగాణతోపాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలపై దృష్టి సారించనున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి 100కు పైగా సీట్లున్నాయని.. వీటిలో 50-60 స్థానాలు గెలుస్తామని కేసీఆర్‌ ధీమా వ్యక్తంచేశారని తెలుస్తోంది. మహారాష్ట్రలో రైతులు ఎక్కువమంది ఉన్నారని, ఆ రాష్ట్రం నుంచే ప్రచారం ప్రారంభిద్దామని ఆయన వెల్లడించినట్లు సమాచారం. మహారాష్ట్రలో మరఠ్వాడా ప్రాంతం, కర్ణాటకలోని తెలుగు ప్రాంతాలు, బెంగళూరు వంటి నగరాల్లోనూ పార్టీకి ఆదరణ ఉంటుందని కేసీఆర్‌ ఈ భేటీలో అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని, రాష్ట్రంలో ఉన్న అభివృద్ది మరెక్కడా లేదని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి, ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమం గురించే ప్రచారం చేస్తూ దేశవ్యాప్తంగా ఇలాగే చేస్తామంటే జనం నుంచి ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు. రైతాంగ అజెండా, రైతాంగ సంక్షేమం, దళిత సంక్షేమం ప్రధాన అజెండాలుగా ఉంటాయన్నారు.
సభ్యత్వం పెంచాలిజాతీయ పార్టీగా ఏర్పడ్డాక తెలంగాణలో సైతం ఇప్పుడున్న సభ్యత్వం సరిపోదని, భారీగా పార్టీ సభ్యత్వం పెంచాలని కేసీఆర్‌ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

బయటి రాష్ట్రాల నుంచి కూడా మంచి స్పందన ఉందని.. పార్టీ పెట్టిన సత్వరమే ఆదరణ లభిస్తుందని తెలిపారు. పార్టీ నేతలకు జాతీయ స్థాయి కూడా అవకాశాలు వస్తాయని.. వివిధ రాష్ట్రాల్లో పార్టీ తరఫున ఇన్‌చార్జులుగా పనిచేసే అవకాశం, అదేవిధంగా జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైతే గవర్నర్‌ అవకాశాలు తదితరాలు వస్తాయని అన్నట్లు తెలుస్తోంది. పార్టీలోని కీలక నేతలకు ఏయే బాధ్యతలు అప్పగించాలన్న దానిపైనా చర్చించినట్లు సమాచారం.

టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీకి జాతీయ అధ్యక్షుడుగా ప్రచారం జరుగుతున్నా.. పార్టీకి మాత్రం అధికారికంగా ఆ గుర్తింపు రాలేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇందులో ఏ రకంగా సక్సెస్ కాబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh