Kishan Reddy : కిషన్ రెడ్డికి కేంద్రం పిలుపు
Kishan Reddy : తెలంగాణలో పార్టీ పరిస్థితులపై బిజెపి అధిష్ఠానం దృష్టిసారించింది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఢిల్లీ రావాలంటూ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది.
దీంతో, హైదరబాద్‌లో నేటి కార్యక్రమాలను రద్దు చేసుకున్న ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
అయితే ఇప్పటికే పార్టీ హైకమాండ్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలోనే ఉన్నారు. ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డితో పార్టీ హైకమాండ్ భేటీలో కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.
హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి ఈటల, రాజగోపాల్ చేరుకున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కాగా… గత కొంతకాలంగా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ముఖ్యంగా బీజేపీ తెలంగాణ రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ వర్గం, ఈటల వర్గానికి దూతగా కిషన్‌రెడ్డిని అధిష్టానం పిలిచినట్లు తెలుస్తోంది.
అయితే రాష్ట్ర నాయకత్వంలో చాలా మంది నేతలున్నప్పటికీ.. ఈటల, రాజగోపాల్ రెడ్డి తో సమావేశంలో కిషన్ సయోధ్య కుదిర్చేలా ప్లాన్ రచించినట్లు తెలుస్తోంది.
అటు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా.. ఇటు రాష్ట్ర నాయకత్వంలో కీలక వ్యవహరిస్తుండటంతో.. హైకమాండ్ కిషన్ నే రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
అయితే మొత్తానికి పార్టీ వ్యవహారాలు సెట్ చేసే పనిలో కాషాయ పార్టీ హై కమాండ్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
కేవలం కొన్ని పార్టీ కార్యక్రమాల కోసమే కిషన్ రెడ్డిని ఢిల్లీకి పిలిచారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నప్పటికీ..
అదేం కాదని టీబీజేపీని సెట్ చేసేందుకే పిలిచినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ వెళ్లే ముందు..
రాజగోపాల్ రెడ్డితో ఇప్పుడే మాట్లాడానని.. ఆయన మధ్యాహ్నం ఫ్లైట్ కి బయల్దేరి వస్తున్నట్టు చెప్పారని కిషన్ తెలిపారు.
మరో పక్క కర్ణాటక ఫలితాల తరువాత తెలంగాణలో బీజేపీ దూకుడు కాస్తంత తగ్గిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఈ స్తబ్దతను తొలగించి రాబోయే ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేలా అదిష్ఠానం అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
ఇక అసంతృప్త నేతలను బుజ్జగించే అంశంపై కూడా బిజెపి పెద్దలు దృష్టిసారిస్తున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై పార్టీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.