Hyderabad: మొన్న రేవంత్ రెడ్డికి…ఇప్పుడు రాజాసింగ్‌కు ఘోర అవమానం
Hyderabad: తెలంగాణ కొత్త సచివాలయం వద్ద బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నూతన సచివాలయంలో చేదు అనుభవం ఎదురైంది. బుల్లెట్ బండిపై వచ్చిన రాజాసింగ్ ను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. గ్రేటర్ ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన్ను సచివాలయంలోకి అనుమతించలేదు. దీంతో రాజాసింగ్ అక్కడి నుంచి వెనుదిరిగారు. సచివాలయంలోకి వెళ్లకుండా తనని అడ్డుకోవడంపై రాజాసింగ్ మండిపడ్డారు. సిటీ ఎమ్మెల్యేలతో మీటింగ్ ఉందని మంత్రి తలసాని పిలిస్తేనే సచివాలయానికి వచ్చానని రాజాసింగ్ అన్నారు. ఎమ్మెల్యేలకే సచివాలయంలోకి అనుమతి లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రజల డబ్బుతో కట్టిన సచివాలయంలోకి ప్రజా ప్రతినిధులను అనుమతించకపోవటం సిగ్గుచేటన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సచివాలయంలో గ్రేటర్ ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కూడా ఆహ్వానం పంపారు. ఇదే విషయాన్ని మంత్రి పేషీ కూడా చెబుతుతోంది. తాము ఆహ్వానం పంపామని, రాజాసింగ్ గేటు వరకు వచ్చి వెళ్లిపోయారని మంత్రి పేషీ ప్రకటించింది. అయితే రాజాసింగ్ సెక్రటేరియట్‌లో మీటింగ్ అని చెప్పి తనను ఆహ్వానించి లోనికి అనుమతించకపోవడాన్ని గోషామహల్ తీవ్రంగా తప్పుబట్టారు.
అయితే ఇటీవల నూతన సెక్రటేరియట్‌కు వెళ్లేందుకు యత్నించిన టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని సైతం భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. సెక్రటేరియట్ సమీపంలోని టెలిఫోన్ భవన్ ప్రాంతంలోనే రేవంత్ రెడ్డి వాహనాన్ని పోలీసులు నిలిపేశారు. తనను అడ్డగించటంపై రేవంత్ పోలీసు ఉన్నతాధికారులపై ఫైరయ్యారు. తనకు ఎలాంటి అనుమతి అవసరం లేదని తాను ఒక ఎంపీనని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లపై అవకతవకలపై RTI యాక్ట్ ప్రకారం వివరాలు తెలుసుకునేందుకు.. HMDA ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నానని రేవంత్ వారితో చెప్పారు.
అనుమతి లేకుండా Hyderabad సెక్రటేరియట్ లోపలికి ఎవరినీ పంపిచొద్దని పైనుంచి ఆదేశాలున్నాయని పోలీసులు రేవంత్‌కు సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ.. రేవంత్ మాత్రం పట్టు విడవలేదు. అయితే ఆయన వెళ్లాల్సిన డిపార్ట్‌మెంట్ కొత్త భవనంలో లేదంటూ.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ భవన్‌కు రేవంత్‌ను తరలించారు. దీంతో ఆ హైడ్రామాకు తెరపడింది. అయితే ప్రభుత్వం అవినీతి బయపడుతుందన్న భయంతోనే తనను కొత్త సెక్రటేరియట్‌లోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని రేవంత్ ఆరోపించారు.