మూడు రాజధానుల దిశగా వైసీపీ మరో కీలక బిల్లుకు లోక్ సభ గ్రీన్ సిగ్నల్
వైసీపీ సర్కార్ మాత్రం ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం గత మూడేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే అమరావతికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు దీనికి అడ్డంకిగా మారింది.దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసినా విచారణ అంతకంతకూ ఆలస్యమవుతుండటం సమస్యగా మారింది. ఎన్నికలకు ఏడాది కాలం మాత్రమే ఉన్న తరుణంలో విశాఖకు రాజధాని తరలింపులో విఫలమైతే సమస్యలు తప్పని పరిస్దితుల్లో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ రోజు మార్గం లభించింది.
ఏపీ రాజధానులకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టులో కేంద్రం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో విభజన చట్టం ప్రకారం అమరావతి రాజధానిగా ఏర్పడిందని తెలిపింది. ఆ తర్వాత వైసీపీ సర్కార్ తీసుకున్న మూడు రాజధానుల విషయంలో ముందస్తుగా సమాచారం ఇవ్వలేదని వెల్లడించింది. దీంతో ఏపీ విభజన బిల్లులో మార్పులు చేస్తే తప్ప మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యమయ్యేలా లేదు. ఈ నేపద్యం వైసీపీ ఎంపీ మార్గాని భరత్ లోక్ సభలో ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టేందుకు నోటీసిచ్చారు.
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుతో పాటు విభజన హామీలు నెరవేర్చేందుకు వీలుగా విభజన చట్టంలో సవరణలు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టేందుకు లోక్ సభ అనుమతి కోరారు. దీన్ని పరిశీలించిన లోక్ సభ సచివాలయం ఈ ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. దీనిపై తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇస్తున్నట్లు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కు సమాచారం కూడా పంపింది. దీంతో ప్రైవేటు మెంబర్ బిల్లు త్వరలోనే పార్లమెంటు ముందుకు రాబోతోంది.
ఏపీ పునర్విభజన చట్టంపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ప్రైవేట్ మెంబర్ బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టి చర్చకు చేపడితే ఆ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా సుప్రీంకోర్టులో ప్రస్తుతం దీనిపై కేసు నడుస్తున్న నేపథ్యంలో పార్లమెంటులో ఈ బిల్లు చర్చించే అవకాశాలు తక్కువే. అయితే ఒక వేళ లోక్ సభ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని చర్చించి విభజన చట్టంలో మార్పులు చేపడితే మాత్రం వైసీపీ మూడు రాజధానులకు లైన్ క్లియర్ అవుతుంది మరి. అప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండానే మూడు రాజధానుల ప్రక్రియ చేపట్టేందుకు ఏపీ అసెంబ్లీకి అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి :