NEW DELHI: లైంగిక వేధింపులపై ఢిల్లీ పోలీసుల చర్యను ప్రశ్నించిన రాహుల్
భారత్ జోడో యాత్ర సందర్భంగా మహిళలపై ఇప్పటికీ లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ తాను చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసుల నుంచి తనకు అందిన నోటీసుపై వివరణ ఇచ్చేందుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, వాయనాడ్ లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ 8 నుంచి 10 రోజుల సమయం కోరారు. కాగా రాహుల్ గాంధీకి ఢిల్లీ పోలీసులు మహిళలపై ఇప్పటికీ లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ తాను చేసిన వ్యాఖ్యలపై నోటీసులు పంపించారు. ఆ నోటిస్ లో పలు కీలక అంశాలను పొందుపరిచారు. వాటికి సమాధానాలను ఇవ్వాలని, సమగ్ర వివరాలను అందజేయాలనీ ఆదేశించారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాను వ్యక్తం చేస్తోంది. మరోసారి రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తోంది. లైంగిక వేధింపులకు పాల్పడిన వారి వివరాలను తమకు అందజేయాలంటూ ఢిల్లీ పోలీసులు- రాహుల్ గాంధీకి పంపించిన ఈ నోటీసుల్లో పొందుపర్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారతీయ జనతా పార్టీ పరిపాలనలో పలువురు మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, బాధితులు తనను కలుసుకుని- భద్రత కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావాలని కోరారంటూ ఇదివరకు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
కాగా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులపై చట్టాలను కఠినంగా అమలు చేసేందుకు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చొరవ తీసుకుంది. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై లైంగిక వేధింపుల నిరోధక, నియంత్రణ చట్టం పకడ్బందీగా అమలు చేయడంలో లోటుపాట్లు ఉన్నాయని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ సోమవారం ఢిల్లీ అధికారులకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.
ప్రతి జిల్లాలో కార్యాలయాలు, వాణిజ్య సంస్ధల్లో లైంగిక వేధింపులపై ఫిర్యాదులు స్వీకరించే స్ధానిక ఫిర్యాదుల కమిటీ (ఎల్సీసీ)లు ఇంకా అన్ని చోట్ల ప్రారంభం కాలేదని నివేదిక పేర్కొంది. ఆయా జిల్లాల్లో ఎల్సీసీల వివరాలను నిర్ధిష్ట సమాచారం కోరుతూ జిల్లా మేజిస్ట్రేట్లకు నోటీసులు జారీ చేశామని తెలిపింది. 2019-21 నుంచి అన్ని ఎల్సీసీల పరిధిలో కేవలం 40 ఫిర్యాదులే వచ్చాయని తమ పరిశీలనలో వెల్లడైందని పేర్కొంది. ఢిల్లీలోని ఓ జిల్లాలో మూడేండ్లలో కేవలం మూడు కేసులే వచ్చాయని వెల్లడించింది. పశ్చిమ జిల్లాలో ఒక్క కేసు కూడా వెలుగుచూడలేదని నివేదిక తెలిపింది. తక్కువ ఫిర్యాదులు వచ్చిన చోట కూడా వీటిని సకాలంలో పరిష్కరించలేదని డీసీడబ్ల్యూ నివేదిక అసంతృప్తి వ్యక్తం చేసింది.