కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 13వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. అయితే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల డేట్ ఫిక్స్ చేసిన తరువాత సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.
తుమకూరు గ్రామీణ ఎమ్మెల్యే డీసీ, గౌరీ శంకర్ ఎమ్మెల్యే పదవి మీద కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ దత్ అనర్హత వేటు వేశారు. జేడీఎస్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మీద బీజేపీ నాయకుడు సురేష్ గౌడ ఇంతకాలం కోర్టులో న్యాయపోరాటం చేశారు. ఇంతకాలం సుదీర్ఘంగా విచారణ చేసిన కర్ణాటక హైకోర్టు జేడీఎస్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మీద అనర్హత వేటు వేసింది. అయితే నెల రోజుల పాటు తీర్పుపై స్టే ఇవ్వాలని ఎమ్మెల్యే తరపు న్యాయవాది కోర్టుకు మనవి చేశారు.
2018లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సందర్బంలో తుమకూరు గ్రామీణ నియోజక వర్గం నుంచి పోటీ చేసి జేడీఎస్ నాయకుడ గౌరీ శంకర్ ఆ నియోజక వర్గంలోని 32 వేల మందికి, 16 వేల పిల్లలకు ఇన్సూరెన్స్ చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే అందరికి ఇన్సూరెన్స్ బాండులు పంపిణి చేసిన గౌరీ శంకర్ జేడీఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీజేపీ నుంచి అదే నియోజక వర్గం నుంచి పోటీ చేసిన సురేష్ గౌడ ఎన్నికల కమీషన్, పోలీసులకు జేడీఎస్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మీద ఫిర్యాదు చేశారు. అక్రమ మార్గంలో ఎమ్మెల్యే అయిన జేడీఎస్ లీడర్ గౌరీ శంకర్ ఎమ్మెల్యే పదవి మీద అనర్హత వేటు వెయ్యాలని సురేష్ గౌడ కోర్టును ఆశ్రయించారు. తన మీద నమోదు అయిన కేసును రద్దు చెయ్యాలని ఎమ్మెల్యే గౌరీ శంకర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు అతని పిటిషన్ కు కొట్టి వేసింది.
సుప్రీం కోర్టును ఆశ్రయించిన జేడీఎస్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ కు అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. ఇదే సమయంలో జేడీఎస్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ నకిలి ఇన్సూరెన్స్ బాండులు పంపిణి చేసి ప్రజలను మోసం చేశారని సీఐడీ అధికారులు కోర్టుకు చార్జ్ షీట్ సమర్పించారు. కేసు విచారణ చేసిన హైకోర్టు జేడీఎస్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ ఎమ్మెల్యే పదవి మీద వేటు వేసింది. ఆరు సంవత్సరాలు గౌరీ శంకర్ ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా అనర్హత వేటుపడింది.