తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరు ముదిరి పాకానపడింది. అసలు వర్సెస్ వలస నేతల వైరంతో కాంగ్రెస్‌పార్టీ రెండుగా చీలిపోయింది. సీనియర్ నేతల తిరుగుబాటును లెక్కచేయని రేవంత్ టీమ్.. యాక్షన్‌లోకి దిగింది. అదికాస్తా నెక్ట్స్ లెవల్‌కి చేరిపోయింది. టుడే వాట్ నెక్స్ట్స్ అనేదే ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కొత్త కమిటీలొచ్చి కుళ్లబొడిచేశాయి. కష్టపడి పనిచేసి అధికారంలోకి వచ్చేది మానేసి.. కుంపట్లు వెలిగించుకుని చలికాచుకోవడమే కనిపిస్తోంది. నిన్న జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ఎగ్జిక్యూటీవ్ సమావేశానికి సీనియర్ నేతలు ఎవ్వరూ హాజరు కాకపోవడం, అటు రేవంత్ వర్గం రాజీనామాలతో టి.కాంగ్రెస్‌లో తుఫాన్ వచ్చేలా చేసింది. అయితే.. రేపు కాంగ్రెస్ సీనియర్లు మహేశ్వర్‌రెడ్డి ఇంట్లో సమావేశం కానున్నారు.
ఇప్పటికే చర్చించిన సీనియర్లు.. రేపటి భేటీ అనంతరం.. ఎల్లుండి ఢిల్లీ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. సీనియర్ల విమర్శలకు రేవంత్ వర్గం రిజైన్లతో కౌంటరిచ్చింది. ఇప్పటివరకు 13 మంది రాజీనామాలు చేశారు. ఈ పరిణామాల మధ్య హైకమాండ్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కమిటీలో మార్పులా..? సీనియర్ల తిరుగుబాటుపై చర్యలా..? ఇంకా రాజీనామా చేసిన వారికి ఎలాంటి రిప్లై రానుంది..? అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే.. దీనిపై స్పందించిన టీపీసీసీ చీఫ్.. ఇది కుటుంబ సమస్య అని.. దీనికి హైకమాండ్ పరిష్కారం చూపుతుందంటూ కూల్ గా సమాధానమిచ్చారు.
ఇక రెండువర్గాలుగా చీలిపోయిన తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి గళం తారస్థాయికి చేరింది. ఇరువర్గాల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. సీనియర్ నేతలపై రేవంత్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్‌రెడ్డిని బలహీనపర్చే కుట్ర జరుగుతోందన్నారు. రేవంత్ యాత్రను దెబ్బతీయాలని పన్నాగం చేసి.. పార్టీ ముసుగువీరులు బయటకు వచ్చారంటూ విమర్శిస్తున్నారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడారు.. అప్పుడు సేవ్ కాంగ్రెస్ ఎందుకు గుర్తుకురాలేదంటూ ప్రశ్నిస్తున్నారు.
అటు సీనియర్లు రేవంత్ మీటింగ్‌కు హాజరుకాకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ స్పందించారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు పార్టీలో తీవ్ర అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యానించారు. అలా జరగకూడదనే తమ ఉద్దేశ్యమన్నారు వీహెచ్.
కాంగ్రెస్‌లో సంక్షోభంపై సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. గతంలో ఇలాంటి ఇష్యూస్ చాలా జరిగాయన్నారు. ఏం ఉన్నా అంతర్గతంగా చర్చిస్తానన్నారు. కమిటీ విషయంలో గతంలోనూ గొడవలు జరిగాయని, ఇది కొత్తేం కాదన్నారు జానారెడ్డి.
ఇంత లొల్లి జరిగినా..అదేం లేదన్నట్లు అంతా కూల్‌గా కనిపించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. సమావేశంలో కూడా గొడవకు తావివ్వకుండా కూల్‌గా ఎజెండాను అమలు చేశారు రేవంత్. పార్టీలో ఏవైనా సమస్యలుంటే అధిష్ఠానం పరిష్కరిస్తుందని, బంతిని ఢిల్లీకోర్టులో పడేశారు. గొడవలు వద్దు..ఎజెండానే ముఖ్యమంటూ పేర్కొన్నారు. ఏఐసీసీ చెబితేనే మీటింగ్ ఏర్పాటు చేశానని.. సమస్యలుంటే అధిష్ఠానం చూసుకుంటుందంటూ పేర్కొన్నారు. ఇది తమ ఇంట్లో సమస్య అని.. అదే సర్దుకుంటుందంటూ పేర్కొన్నారు.
పార్టీ చీలినా..పార్టీ కార్యాచరణ మాత్రం ఆగదంటోంది టీపీసీసీ. తెలంగాణ వ్యాప్తంగా జనవరి 26 నుంచి ‘హాత్ సే హాత్ జోడో’ పేరుతో మెగా పాదయాత్రకు స్కెచ్చేశారు రేవంత్‌రెడ్డి. రెండునెలల పాటు జరిగే ఈ యాత్ర కోసం రూట్ మ్యాప్ రెడీ అయ్యింది. సో..హస్తం పార్టీలో కదనోత్సాహం గ్యారంటీ అంటోంది తెలంగాణాలో రేవంత్ కాంగ్రెస్.