రికార్డులు బద్దలు కొట్టి ఫైనల్‌కి చేరిన చెన్నై సూపర్ కింగ్స్

సొంత గడ్డపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ అదరగొట్టింది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఐపీఎల్ 2023 తొలి క్వాలిఫయర్‌లో 15 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) ఘన విజయం సాధించింది.

దీంతో, మహేంద్ర సింగ్ ధోనీ సేన ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. సీఎస్‌కే ఫైనల్ చేరడం ఇది పదోసారి. ఐపీఎల్ సీజన్ 16 తొలి క్వాలిఫయర్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగింది. టాస్ గెలిచిన గుజరాత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్‌‌కు 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ప్రారంభం నుంచి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇద్దరూ కూడా పవర్ ప్లేలోనే తిరుగుముఖం పట్టారు. అద్భుత ఫామ్‌‌లో ఉన్న గుజరాత్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్, జట్టును విజయ తీరాలకు చేర్చేందుకు ఒంటరి పోరాటం చేశాడు.

7.3 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 50 పరుగులను పూర్తి చేసింది. అయితే 11వ ఓవర్‌లో రవీంద్ర జడేజా గుజరాత్ టైటాన్స్‌‌కు మూడో షాకిచ్చాడు. ఆయన వేసిన బాల్‌కు దసున్ శానక ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో జడేజా అసాధారణంగా బౌలింగ్ చేశాడు.ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ కూడా ఔటయ్యారు.

అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులకు కుప్పకూలింది. శుభ్‌మన్ గిల్(38 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 42), రషీద్ ఖాన్(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) మినహా అంతా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్‌పాండే, మతీశ పతీరణ తలో వికెట్ తీసారు.

అయితే ఇలా గుజరాత్ టైటాన్స్ వికెట్లు వరుసగా పడుతూనే ఉన్నాయి. ‘‘మిడిల్ ఓవర్లలో మేం వికెట్లను కోల్పోయాం, అందుకే ఓడిపోయాం’’ అని మ్యాచ్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా చెప్పాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 44 బాల్స్‌లో 60 పరుగులు చేశాడు. రెండో ఓపెనర్ డేవాన్ కాన్వే 34 బాల్స్‌లో 40 పరుగులు చేశాడు. పవర్‌ ప్లే‌ తొలి ఆరు ఓవర్లలో, సీఎస్‌కే టీమ్ 49 పరుగులు చేసింది. 10 ఓవర్లలో సీఎస్‌కే స్కోరు 85కి చేరింది. 18.2 ఓవర్లకు ఇది 150 పరుగులకు చేరుకుంది.రవీంద్ర జడేజా 16 బాల్స్‌లో 22 పరుగులు చేశాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాత్రం ఈ మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క రన్ తీశాడు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh