Rahul Gandhi: రాహుల్ గాంధీ ఊహించని మరో షాక్
2019లో ప్రధాని మోడీ ఇంటిపేరుపై వివాదాస్పద కామెంట్లు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. పరువు నష్టం కేసులో ఐపీసీ సెక్షన్ 504 కింద రాహుల్ గాంధీని దోషిగా పేర్కొంది.
2019లో కర్నాటకలోని కోలార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశంలోని దొంగలందరి ఇంటి పేర్లు మోడీ అనే ఎందుకు ఉంటాయంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కోర్టులో కేసు వేశారు ఓ వ్యక్తి. రెండేళ్ల విచారణ తర్వాత వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే 2023, మార్చి 23వ తేదీ గురువారం సూరత్ కోర్టుకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. ప్రధాని మోడీ ప్రతిష్టకు భంగం కలిగించారని సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయని నిర్థారించిన కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీనితో లోక్‌సభ సభ్యత్వం నుంచి రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది.
అయితే ఇప్పుడు మరో బిగ్ షాక్ తగిలింది ఆయన ప్రస్తుతం ఉంటోన్న ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయాలని లోక్‌సభ హౌజింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 22లోగా ఆయన తన బంగళాను ఖాళీ చేయాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. ఖాళీ చేయడానికి ఆయనకున్న వ్యవధి 26 రోజులు మాత్రమే. 2014 నుంచి రాహుల్ ఢిల్లీ 12 తుగ్లక్ లేన్ లోని ప్రభుత్వ బంగ్లాలో ఉంటున్నారు.
దీనికి సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి సర్క్యులర్ జారీ అయింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత పడింది. సూరత్ కోర్ట్ తీర్పు ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలకు దిగింది. ‘‘ కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(e) ప్రకారం నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొంటూ లోక్‌సభ సెక్రటరీయేట్ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ సర్క్యూలర్ జారీ చేశారు.
ఈ కేసులో సూరత్ కోర్ట్ ప్రస్తుతానికి కోర్టు 30 రోజుల బెయిల్ ఇచ్చినా తర్వాత ఆయనకు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాబోతున్నాయి. పై కోర్టులు కనుక సూరత్ కోర్ట్ తీర్పును కొట్టేయకపోతే రాహుల్ ఎనిమిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. అయితే సూరత్ కోర్ట్ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ శివసేన వర్గం అధినేత ఉద్ధవ్ థాకరేతో పాటు అనేక పార్టీల నేతలు ఇప్పటికే రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ సెక్రటరీ జనరల్ రద్దు చేయడాన్ని తప్పుబట్టారు.