టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. అమిత్ షా, జేపీనడ్డా మోదీలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. హస్తినలోని అమిత్ షా నివాసంలో 50 నిముషాల పాటు అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశం కొనసాగింది. ఏపీ, తెలంగాణ సహా జాతీయ రాజకీయ అంశాలు, పొత్తులపై జేపీ నడ్డా, అమిత్ షాతో చంద్రబాబు చర్చించారు. పొత్తులు, ఎన్డీఏలో భాగస్వామ్యంపై ప్రాధమిక చర్చలు జరిగినట్లు సమాచారం. భవిష్యత్ లో మరిన్ని సమావేశాలు ఉండే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
అలాగే ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానుండటం కీలకంగా మారింది. ఇవాళ ఉదయం మోదీతో భేటీ ముగిసిన తర్వాత చంద్రబాబు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరిగి బయల్దేరనున్నారు. అలాగే నేడు పలువురు కేంద్ర పెద్దలను కూడా కలిసే అవకాశముందని తెలుస్తోంది. గతంలో జరిగిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో మోదీతో 5 నిమిషాల పాటు చంద్రబాబు ఏకాతంగా మాట్లాడారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ మోదీతో చంద్రబాబు భేటీ కానుండటం చర్చనీయాంశంగా మారింది. ఏపీలోని రాజకీయ పరిస్థితుల గురించి మోదీకి చంద్రబాబు వివరించే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లో పొత్తుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశముందని సమాచారం.
అయితే త్వరలో టీడీపీ, బీజేపీ పొత్తుపై క్లారిటీ రానుంది. టీడీపీని కలుపుకుంటే జాతీయ స్థాయిలో ఎన్డీఏ బలం పెరుగుతుందన్న భావనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధిష్టానం పెద్దలతో చంద్రబాబు భేటీపై తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు అయోమయంలో ఉన్నారు.
అయితే ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వైఎస్సార్ సీపీ వ్యతిరేక ఓట్లను చీల్చనివ్వబోమని తెలిపారు . బీజేపీతో కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ ప్రకటనలు సైతం చేశారు.
అలాగే మరొకవైపు అవసరమైతే వైఎస్సార్ సీపీ ఎన్డీఏ కూటమిలోకి వస్తుందని, టీడీపీకి మాత్రం ఛాన్స్ ఇవ్వవద్దని సీఎం జగన్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలను కోరినట్లు వాదన సైతం వినిపిస్తోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్ అయితే 2014 కూటమి పదేళ్ల తరువాత మరోసారి ఏపీలో రిపీట్ కానుంది.