జవహర్నగర్ ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరో కీలక మైలురాయిని అధిగమించింది. జవహర్నగర్ డంపింగ్ యార్డు ప్రాంగణంలో కాలుష్య కారక వ్యర్థాల శుద్ధి ప్లాంట్ను పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, మంత్రి మల్లారెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు.దీంతో జవహర్ నగర్ లోని డంప్ యార్డ్ తో కలుషితమవుతున్న భూగర్భ జలాలు, చెరువులు కలుషితం కావని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు.
కాగా, జవహర్ నగర్ లోని డంప్ యార్డ్ లో కొన్నేళ్లుగా చెత్తా,చెదారం నిల్వ ఉండడంతో చుట్టుపక్కల నీరు కలుషితమవుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే పొడి చెత్తను రీసైకిల్ చేయడానికి అంతర్జాతీయ స్థాయి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇక నుంచి ద్రవ వ్యర్థాలను కూడా పూర్తిగా శుద్ధి చేయాలని నిర్ణయించారు.
దాని కోసమే 251 కోట్లతో ఈ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను నిర్మించడం జరిగింది. కలుషిత వ్యర్థ జలాలను పూర్తిగా శుద్ధి చేసేందుకు సమగ్ర పరిష్కారం 2017లో ప్రారంభించిన మొబైల్ ఆర్వో సిస్టం ద్వారా రోజుకు 2వేల కిలో లీటర్ల కెపాసిటీతో కలిగిన పాక్షిక ట్రీట్మెంట్ పరిషారాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత రోజుకు 4వేల కిలోలీటర్లకు పెంచారు. దీంతో పాటు అప్పటికే వ్యర్థ జలాలు నిండిన మల్కారం చెరువులోని దాదాపు 11.67 లక్షల కిలో లీటర్ల నీటిని శుద్ధి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగాయి. అంతేకాకుండా ఈ చెరువులోని వ్యర్థ జలాలు పొంగిపొర్లకుండా సుమారు 4 కోట్ల 35 లక్షలతో స్ట్రామ్ వాటర్ డైవర్షన్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసింది. జవహర్నగర్ డంప్ యార్డ్ పైనుంచి వచ్చే వరద నీటి వల్ల జరుగుతున్న కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టడం కోసం క్యాపింగ్ పనులు చేపట్టిన జీహెచ్ఎంసీ 2020 నాటికి పూర్తి చేసింది.
అయితే సంవత్సర కాలంగా కొనసాగుతున్న పనుల్లో భాగంగా ఇప్పటికే 43% మేర మల్కారం చెరువు శుద్ధి పూర్తయింది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న కాలుష్య నియంత్రణ మండలి లాంటి ఏజెన్సీలు కూడా ఈ అంశాన్ని ధ్రువీకరించాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ మొదటి దశలో భాగంగా 5.7 ఎకరాల మేర ఉన్న చెరువు నీటిని శుద్ధి చేసింది. పేరుకుపోయిన మురికిని శుద్ధి చేసే పనులు కొనసాగుతున్నవి. త్వరలోనే మల్కారం చెరువు జలాలు శుద్ధి కానున్నాయి. పనులు పూర్తయితే జవహర్నగర్, పరిసర ప్రాంతాల్లో ఘన వ్యర్థాలతోపాటు, కలుషిత జలాల సమస్య కూడా పూర్తిగా అరికట్టబడుతుంది.