corona varies :దేశంలో కొత్తగా 2,994 కరోనా కేసులు.. ఐదుగురు మృతి
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడమే కాకుండా దాదాపుగా జీరోకు చేరిందని ఊపిరి పీల్చుకునేలోగా ఇప్పుడు మరోసారి ఈ మహమ్మారి కోరలు చాచేందుకు సిద్ధమౌతోంది. గత కొద్దిరోజుల్నించి కరోనా వైరస్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది.ఇప్పుడు తాజాగా దేశంలో మూడు వేలకు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 1,43,364 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,994 కొత్త కేసులు బయటపడ్డాయి. మరోవైపు దేశంలో పాజిటివ్ కేసుల (Positive Cases) సంఖ్య 16వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 16,354 కేసులు యాక్టివ్‌గా (Active Cases) ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి 4,41,71,551 మంది కోలుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో కేరళలో ముగ్గురు, గోవా గుజరాత్ లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మృతి చెందారు. దీంతో కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,30,876కి చేరింది.
ఇక ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.04 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రికవరీ రేటు 98.77 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.66 (220,66,09,015) కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
‘కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడ స్థానికంగా కేసులు హఠాత్తుగా పెరుగుతున్నాయనే సంకేతాలను ఈ సంఖ్యలు ఇస్తున్నాయి. కాబట్టి, స్థానికంగా కేసులు ప్రబలకుండా నివారణ, కట్టడి చర్యలు తీసుకోవాలి. కరోనా పై పోరులో మనం సాధించిన విజయాలు నిష్ఫలం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని కేంద్రం తెలిపింది.
‘రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ఏ ఏరియాల్లోనైనా కేసులు వేగంగా రిపోర్ట్ అవుతున్నాయంటే తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. మైక్రో లెవల్లో అంటే జిల్లా స్థాయిలో, సబ్ డిజిస్ట్రిక్ స్థాయిలో నియంత్రణ చర్యలను తీసుకోవాలి’ అని వివరించింది.