RRR: ఆస్కార్ కోసం ఎంత ఖర్చు అయ్యిందో క్లారిటీ ఇచ్చిన రాజమౌళి తనయుడు
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలోకి నాటునాటు పాటకు ఆస్కార్ రావడంతో తెలుగు సినిమా స్థాయి ఉన్నతశిఖరాలకు తాకింది. అయితే ఈ సినిమా దర్శకుడు మ్యూజిక్ డైరెక్టర్ మరియు హీరోలు ఆస్కార్ వేడుకల్లో సందడి చేశారు. ఇక ఆ సినిమా ద్వారానే రాజమౌళి ఆస్కార్ వరకు వెళ్లడం కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
నాటు నాటు పాటకు ఆస్కార్ తో తెలుగు ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినట్లయింది. అయితే ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రాజమౌళి టీమ్ దాదాపు 80 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ విషయంలో ఆయన తనయుడు కార్తికేయ అసలు లెక్క గురించి వివరణ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..
ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాటకు ఆస్కార్ రావడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించారు. అయితే అదే సమయంలో ఆస్కార్ కోసం విపరీతంగా ఖర్చు పెట్టారన్న విమర్శలు వచ్చాయి.
తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వారు సైతం ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చు పెట్టారని, ఆ డబ్బుతో కొన్ని సినిమాలు తీయవచ్చని చెప్పడం వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆస్కార్ వచ్చిన తర్వాత కూడా 80 కోట్లు పెట్టి ఆస్కార్ కొన్నారన్న ఆరోపణలూ వచ్చాయి.
అయితే వీటన్నింటికి చెక్ పెట్టాడు ఆర్ఆర్ఆర్ లైన్ ప్రొడ్యూసర్, ఆస్కార్ క్యాంపెయిన్ ను ముందుండి నడిపించిన రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తికేయ.. అసలు ఆస్కార్ క్యాంపెయిన్ కు ఎంత ఖర్చు అయిందో చెప్పాడు. ముందుగా అయితే డివివి.దానయ్యను కావాలనే దూరం పెట్టారు అనే విధంగా కొన్ని వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే అదే విషయంలో కార్తికేయ ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా ఈ స్థాయిలో గుర్తింపు పొందడానికి ముఖ్య కారణం దానయ్య గారు అని కార్తికేయ ప్రత్యేకంగా ట్వీట్ చేయడంతో వారి మధ్య కూడా ఎలాంటి విభేదాలు లేవని అర్థమైపోయింది.
అలాగే ఆస్కార్ క్యాంపెయిన్ చేయడం కోసం హాలీవుడ్ సినిమా వాళ్లు పలు స్టూడియోలను ఆశ్రయిస్తారని, కానీ తమకు అలాంటి ఆస్కారం లేదని కార్తికేయ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. స్వయంగా తామే క్యాంపెయిన్ చేసుకున్నామని, అందుకోసం మొదట తాము అనుకున్న బడ్జెట్ కేవలం రూ.5 కోట్లేనని కార్తికేయ చెప్పాడు.
అయితే అది కూడా ఎక్కువ అనిపించి వీలైనంత వరకు తగ్గిద్దామని ప్రయత్నించినట్లు తెలిపాడు. అయితే నాటు నాటు పాటకు నామినేషన్స్ వచ్చిన తర్వాత బడ్జెట్ పెంచి క్యాంపెయిన్ చేసినట్లు చెప్పాడు.
మొత్తం ఆస్కార్ క్యాంపెయిన్ కు ఐదారు కోట్లు అవుతుందని అనుకున్నప్పటికీ చివరికి రూ.8.5 కోట్లు అయిందని కార్తికేయ అసలు ఫిగర్ చెప్పాడు న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ లో మరిన్ని స్క్రీనింగ్స్ వేయాల్సి వచ్చిందన్నాడు. అయితే RRR సినిమాను నాన్ ఇండియన్స్ బాగా ఆదరించారని చెప్పాడు కార్తికేయ. సినిమాపై ప్రేమ, గౌరవంతో ప్రేక్షకులు తమకు ఉచిత ప్రమోషన్ చేశారని అన్నాడు.