SSC Constable Posts: కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య 50,187కి పెంపు
కేంద్ర సాయుధ బలగాలు కానిస్టేబుల్ జీడీ పరీక్ష రాసిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.మరోసారి కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను పెంచుతున్నట్టు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. తాజాగా ఆ పోస్టుల సంఖ్యను 50,187కు పెంచుతూ ప్రకటన విడుదల చేసింది.ఈ సారి 3,257 పోస్టులను పెంచడంతో మొత్తం ఖాళీల సంఖ్య 50,187కి చేరింది. కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో పేర్కొన్న పోస్టుల సంఖ్యలో ఇప్పటికే రెండుసార్లు సవరణ చేసిన సంగతి తెలిసిందే.
తొలుత సీఏపీఎఫ్ జీడీ కానిస్టేబుల్ ఉద్యోగ నియామక ప్రకటన విడుదల సమయంలో మొత్తం ఖాళీలను 24,369గా ప్రకటించారు. ఆ తర్వాత గతేడాది నవంబర్‌లో ఆ పోస్టుల సంఖ్యను 45,284కు పెంచుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరో ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఆ పోస్టులకు అదనంగా మరో 1,151 ఖాళీలను కలిపారు. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 46,435కు చేరింది. తాజాగా ఐటీబీపీ విభాగంలో సిబ్బంది నియామకానికి మరో 3,257 పోస్టులను కలపడంతో మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య 50,187కు పెరిగినట్టు ఎస్‌ఎస్‌సీ ప్రకటనలో పేర్కొంది. పదోతరగతి విద్యార్హతగా పేర్కొన్న ఈ ఉద్యోగాలకు జనవరిలో రాతపరీక్ష నిర్వహించారు. రాతపరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం బీఎస్‌ఎఫ్‌లో 21,052, సీఐఎస్‌ఎఫ్‌లో 6060, సీఆర్‌పీఎఫ్‌లో 11169, ఎస్‌ఎస్‌బీలో 2274, ఐటీబీపీలో 1890+3752, ఏఆర్‌లో 3601, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 214, ఎన్‌సీబీలో 175తో కలిపి మొత్తం 50,187 ఖాళీలున్నాయి.
కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్(జీడీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గత ఏడాది నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎస్‌ఎస్‌సీ జనవరిలో ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT)ను నిర్వహించింది. ఈ పరీక్ష సమాధానాల ప్రాథమిక కీని ఫిబ్రవరి 18న విడుదల చేసింది. ఈ కీపై ఫిబ్రవరి 18 నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో స్వీకరించారు. అయితే ఎన్‌సీబీ మినహాయించి మొత్తం ఖాళీల్లో 44,439 పోస్టులు పురుషులకు, 5573 పోస్టులు మహిళలకు కేటాయించారు.