ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ లో ఓ స్థానానికి క్రాస్ ఓటింగ్ జరిగిందని బావించిన వైసీపీ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన తమ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంది. నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ఏపీ సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. కాగా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందేందుకు అవసరమైన మెజారిటీ లేకున్నా 23 ఓట్లతో విజయం సాధించారు. దీంతో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు తేలిపోయింది. దాంతో క్రాస్ ఓటింగ్ కు పాల్పడినాట్లు బావించి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లను సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించారు సజ్జల రామకృష్ణారెడ్డి.
సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మొత్తం ఎపిసోడ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని అన్నారు. మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఆఫర్ చేసి టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని వారిని ప్రభావితం చేశారని, అందుకే క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి బీఫామ్ ఇస్తామని కొందరు ఎమ్మెల్యేలకు హామీ లభించిందని సజ్జల తెలిపారు.
ఎక్కువ నష్టపోయేది పార్టీ కాబట్టే వెంటనే చర్యలు తీసుకున్నామని సజ్జల అన్నారు. తమ అంతర్గత విచారణ ఆధారంగానే నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటేశారని వైసీపీ నాయకత్వం భావిస్తోందని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదనే సీఎం జగన్ సస్పెన్షన్ కు శ్రీకారం చుట్టారని సజ్జల అన్నారు.
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై ప్రశ్నించగా సజ్జల ఆప్షన్ ను ఎమ్మెల్యేలకే వదిలేశారు. రాజీనామా చేయాలా వద్దా అనేది ఎమ్మెల్యేల ఇష్టమని, అయితే ఈ ఎమ్మెల్యేలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు వైసీపీ ఫిర్యాదు చేస్తుందా లేదా అనే విషయాన్ని మాత్రం సజ్జల వెల్లడించలేదు. వైసీపీ వర్గాల సమాచారం మేరకు అధికార పార్టీ ఈ విషయాన్ని కచ్చితంగా అసెంబ్లీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తుంది అని తెలుస్తున్నది.