పెండింగ్ బిల్లుల పై పోరాడుతున్న తెలంగాణ ప్రభుత్వం
శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదని, ఈ మేరకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం కేంద్రం స్పందనను కోరింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రడూడ్, జిస్టస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనం పిటిషన్పై విచారణ జరిపింది.
ఈ సందర్భంగా గవర్నర్కు నోటీసులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది. అయితే కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. నోటీసులు అక్కర్లేదని, అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటామన్నారు. బిల్లుల ఆమోదంపై పురోగతిని తెలుసుకొని చెబుతానని కోర్టుకు తెలిపారు. నోటీసులు అవసరం లేదని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవి దృష్ట్యా నోటీసులు జారీ చేయొద్దని కోరారు. ఈ మేరకు కోర్టు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.
రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదని, సెప్టెంబర్-2022లో ఆమోదించిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లుతో సహా పలు కీలక బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్కు శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలుపడం, తిరస్కరించడం, లేదంటే రాష్ట్రపతి పరిశీలన కోసం పంపే అధికారం ఉందని, అయితే ఈ అధికారాన్ని సాధ్యమైనంత త్వరగా ఉపయోగించాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.
అయితే పెండింగ్లోఉన్న బిల్లులు ఇవే..
- తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు
- ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ వర్సిటీగా అప్గ్రేడ్ చేసే బిల్లు
- జీఎస్టీ చట్ట సవరణ
- ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ
- మున్సిపల్ చట్ట సవరణ
- పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ
- ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లు
- మోటార్ వెహికిల్ టాక్సేషన్ సవరణ బిల్లు