YS Jagan Vizag Visit: నేడు విశాఖలో పర్యటించునున్న ఏపీ సీఎం.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
YS Jagan Vizag Visit: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకమైన రెండు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి జగన్ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. భోగాపురం విమానాశ్రయంతో పాటు, అదానీ డేటా సెంటర్‌కు సిఎం శంకుస్థాపన చేస్తారు.
అయితే ముఖ్యమంత్రి జగన్ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం పర్యటనల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన చంద్ర శేఖర్, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు సిఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా ఎస్‌పీ దీపిక ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు (బుధవారం) ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు భోగాపురం మండలం ఎ.రావివలస గ్రామం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 10.25 గంటలకు జీఎంఆర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు చేరుకుంటారు, ఆ సెంటర్‌ను సందర్శిస్తారు, భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్ధాపన చేస్తారు. 10.30 గంటలకు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని జి.ఎం.ఆర్. గ్రూప్ 2,203 ఎకరాల్లో నిర్మించనుంది.
ఇందులో రూ.4,592 కోట్ల వ్యయంతో ఎయిర్‌పోర్టు తొలిదశ నిర్మాణాన్ని ఆ సంస్థ చేపట్టనుంది. పనులు ప్రారంభించిన నాటి నుంచి గరిష్టంగా మూడేళ్ల వ్యవధిలో నిర్మాణాన్ని పూర్తిచేసి ఎయిర్‌పోర్టు కార్యకలాపాలను ఆ సంస్థ ప్రారంభిస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానం (పిపిపి)లో జి.ఎం.ఆర్. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ దీనిని నిర్మిస్తోంది. తొలిదశలో ఏటా 60 లక్షల మంది(ఆరు మిలియన్ల) ప్రయాణీకులు ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ప్రయాణాలు సాగించేలా డిజైన్ చేశారు. ఆ తర్వాతి దశల్లో ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ప్రతి ఏటా 4 కోట్ల(40 మిలియన్ల) ప్రయాణీకులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తారు.
పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
ఎయిర్‌పోర్టులో ఎంతో కీలకమైన రన్‌వే 3.8 కిలోమీటర్ల పొడవుతో ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 5 వేల చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించనున్న దేశీయ, అంతర్జాతీయ కార్గో టెర్మినల్ ఈ ఎయిర్‌పోర్టుకు అదనపు బలంగా చెప్పవచ్చు. ఈ కార్గో టెర్మినల్ ద్వారా మన రాష్ట్రంతోపాటు సరిహద్దున ఉన్న రాష్ట్రాల నుంచి వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఎగుమతులు, దిగుమతుల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. విమానాశ్రయం పూర్తయితే ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా 5 లక్షలమందికి ఉపాధి లభిస్తుందని అంచనా.
అనంతరం చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. 10.55 గంటలకు సవరవిల్లి వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభ వేదిక వద్దకు చేరుకుంటారు. సభ అనంతరం 1.20 గంటలకు అక్కడి నుంచి విశాఖ పర్యటనకు బయలుదేరుతారు.
అక్కడినుంచి బయలుదేరి రుషికొండలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి చేరుకుంటారు. అక్కడ ఇటీవల వివాహం చేసుకున్న ఎంపీ కుమారుడు దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం సాయంత్రం మధురవాడ హెలిప్యాడ్ నుంచి బయలుదేరి, విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. సాయంత్రం విశాఖ నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.