Y S Vivekananda Reddy: హత్య కేసులో భారీ ట్విస్ట్.. రంగంలోకి రెండో భార్య
Y S Vivekananda Reddy: ఏపీలో తీవ్ర సంచలనాలు రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ఈ కేసులో అసలు నిందితుల్ని తేల్చేందుకు, కుట్ర కోణాన్ని బయటపెట్టేందుకు ఓవైపు సీబీఐ ప్రయత్నిస్తుండగా తమను నిందితులుగా చేర్చడాన్ని సవాల్ చేస్తూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి న్యాయపోరాటం చేస్తున్నారు. మరోవైపు వీరికి ఊరటనివ్వొద్దంటూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో భారీ ట్విస్ట్ తెరమీదికి వచ్చింది. ఇన్నాళ్లుగా ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియని వివేకా రెండో భార్య, ముస్లింమైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇప్పుడు అకస్మాత్తుగా తెరమీదికి వచ్చారు. వివేకాకు తాము కూడా వారసులమని ఆయనకు చెందిన ఆస్తిలో తనకు భాగం కావాలని దానిని వివేకా కుమార్తె సునీతా రెడ్డి తొక్కి పెడుతున్నారని. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయని ఆమె తన తరఫు లాయర్ ద్వారా మీడియాకు సమాచారం ఇచ్చారు.
వచ్చే సోమవారం వివేకా ఆస్తుల్లో వాటా కోరుతూ ఆయన రెండో భార్య షమీమ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన పేరిట, తన కొడుకు పేరిట Y S Vivekananda Reddy రాసిన వీలునామా ప్రకారం రావాల్సిన ఆస్తిని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ కుమార్తె సునీత ఇప్పించాల్సిందిగా కోరుతూ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో తన కొడుకు షేక్ షేహాన్ షా కు డీఎన్ఏ టెస్టులు జరిపి వైఎస్ వివేకా వారసుడో కాదో చెక్ చేసుకోవచ్చని ఆమె కోరబోతున్నట్లు సమాచారం.
రంగంలోకి రెండో భార్య
దీంతో ప్రస్తుతం వివేకా రెండో భార్య విషయం సంచలనంగా మారింది. అంతేకాదు ఆమె ఇంత హఠాత్తు గా తెరమీదికి ఎందుకు వచ్చారు? దీని వెనుక ఎవరు ఉన్నారు? అనే చర్చ కూడా జరుగుతోంది.
ఇప్పటికే Y S Vivekananda Reddy హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన రెండో భార్య షమీమ్, కుమారుడు షెహన్ షా కోసం ఏమేం చేశారో బయటపెట్టారు. అలాగే వీరితో ఆస్తులు పంచుకునే విషయంలో మొదటి భార్య కుమార్తె సునీత, ఆమె కుటుంబంతో వచ్చిన విభేదాలు హత్యకు దారి తీసినట్లు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు షమీమ్ ఆస్తుల కోసం కోర్టుకెక్కితే ఈ వ్యవహారంలో మరో భారీ టర్న్ తప్పేలా లేదు.
ఇటీవల ఎంపీ అవినాష్‌ను సీబీఐ 5వ సారి విచారణ కు పిలిచిన వెంటనే ఆయన తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ వేశారు. ఈ కేసుకు తనకు సంబంధం లేదన్నారు. అంతేకాదు. వివేకారెండో పెళ్లి చేసుకున్నారని వారికి ఒక కుమారుడు కూడా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్‌లో ఇల్లు కూడా కట్టిస్తానని చెప్పారని దీంతో సునీత కు ఈ కుటుంబానికి మధ్య వివాదాలు మొదలయ్యాయని ఆస్తి తగాదాల నేపథ్యంలో వివేకా హత్య జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన అలా ప్రకటన చేసిన రెండు రోజుల్లోనే షమీమ్ తెరమీదికి వచ్చారు.