Tammineni Sitaram: నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ తో లా కోర్స్
Tammineni Sitaram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభాపతి తమ్మినేని సీతారం నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ గోల ఇపుడు ఏపీ రాష్ట్రంలో పెను చర్చనీయాంశంగా మారింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో చదవకుండానే తమ్మినేని సీతారాంకు డిగ్రీ సర్టిఫికేట్ ఎలా వచ్చిందంటూ టీడీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదే విషయంపై టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. తమ్మినేని నకిలీ సర్టిఫికేట్‌పై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
తమ్మినేని తనదిగా చెబుతున్న హాల్ టిక్కెట్ (నంబర్ 1791548430) డి.భగవంత్ రెడ్డ తండ్రి బి.స్వామిరెడ్డి పేరిట ఉందని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే తమ్మినేని బీకాం డిగ్రీ సర్టిఫికేట్‌తో పాటు ప్రొవిజినల్, మైగ్రేషన్ సర్టిఫికేట్, టీసీ ఇలా అన్నీ నకిలీ సర్టిఫికేట్లేనని అర్థమవుతుందన్నారు.
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన తమ్మినేని మూడేళ్ల లా కోర్సు ఎలా చేశారన్న అనుమానంతో సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. బీఆర్అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలోని నాగర్ కర్నూల్ స్టడీ సెంటర్ నుంచి 2015-18లో Tammineni Sitaram బీకాం పూర్తి చేసినట్టుగా సర్టిఫికేట్లు సమర్పించారని, కానీ ఆ సెంటరులో 2015లో చదువుకున్న మొత్తం 839 మంది విద్యార్తుల జాబితాలో తమ్మినేని పేరు లేదని నర్సిరెడ్డి తెలిపారు.
Tammineni Sitaram నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి లా కోర్సులో చేరిన విషయం తెలుగుదేశం పార్టీ బయటపెట్టింది. ఆయన చదివానని చెబుతున్న నాగర్ కర్నూలు స్టడీ సెంటర్ దగ్గర్నుంచి యూనివర్శిటీ వరకూ అన్ని వివరాలు సేకరించింది. కానీ చర్యలకు అటు తెలంగాణ ప్రభుత్వం ఉపక్రమించలేదు. వైసీపీ సర్కారుతో ఉన్న సన్నిహితం కారణంగా నకిలీ డిగ్రీ ఇచ్చిన తమ్మినేనిపై కానీ.. లా అడ్మిషన్ ఇచ్చిన కాలేజీపై కానీ..ఆ స్టడీసెంటర్ పై కానీ ..ఎక్కడా ఒక్క కేసు నమోదు కాలేదు. ఫేక్ సర్టిఫికెట్లు వెలుగుచూస్తే వెంటనే చర్యలకు దిగుతారు. సంబంధిత యూనివర్సిటీ తక్షణం రంగంలోకి దిగుతుంది. బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కానీ తమ్మినేని విషయంలో ఇవేవీ జరగలేదు. ఎందుకంటే ఆయన జగన్ సర్కారులో స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి కాబట్టి.
ఈ గుట్టు టీడీపీ నేతలు బయటపెట్టారు కనుక లైట్ తీసుకున్నట్టున్నారు. కానీ ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత స్పీకర్ తమ్మినేని సీతారాం ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో రెండు రాష్ట్రాల విద్యాసంస్థలకు సంబంధాలున్నాయి. అత్యున్నత వ్యక్తే నకిలీ సర్టిఫికెట్లు సమర్పిస్తే.. ఇంకా ఇలాంటి ఫేక్ ను ఎంతమంది అనుసరిస్తున్నారో అన్నది అనుమానం కలుగుతోంది. దీనిని నివృత్తి చేయడంతో పాటు నియంత్రించాల్సిన బాధ్యత ఉభయ తెలుగు ప్రభుత్వాలపై ఉంది. అసలు నకిలీ డిగ్రీ ఎవరు తయారు చేశారు?.. ఎందుకుతయారు చేశారు?.. ఇలా ఎన్ని సర్టిఫికెట్లు తయారు చేశారన్నదానిని నిగ్గుతేల్చాలి. అందువల్ల ఈ వ్యవహారం మిద లోతుగా దర్యాప్తు జరిపి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.