Mohammed Siraj: చరిత్ర సృష్టించిన సిరాజ్.. కపిల్ దేవ్ రికార్డు బ్రేక్..!

ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, మ్యాచ్ మొత్తం మీద తొమ్మిది వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు. వింటేజ్ బౌలింగ్‌తో పాటు అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు.

ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 46 వికెట్లు ఉండగా… ఇప్పటివరకు ఈ రికార్డు కపిల్ దేవ్ పేరిట (43 వికెట్లు) ఉంది. జాబితాలో బుమ్రా (51), ఇషాంత్ శర్మ (51) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

ఇంగ్లండ్‌లో ఆడిన టెస్ట్ సిరీస్‌లలో భారత్ తరఫున అత్యధిక వికెట్ల రికార్డును కూడా సిరాజ్ (23) బుమ్రాతో కలిసి పంచుకుంటున్నాడు. బుమ్రా 2021–22 సిరీస్‌లో 23 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఐదు వికెట్ల స్పెల్స్ (ఫైవర్‌ఫర్) అత్యధికంగా తీసిన నాల్గో బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. ఇప్పటికే అతని ఖాతాలో ఐదు ఫైవర్‌ఫర్లు ఉండగా.. ఈ జాబితాలో బుమ్రా (12), అశ్విన్ (11), జడేజా (6) ముందున్నారు.

ఇదిలా ఉంటే.. SENA దేశాల్లో గత 10 ఏళ్లలో భారత్ సాధించిన 9 టెస్ట్ విజయాల్లో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లలో అతని ఖాతాలో మొత్తం 51 వికెట్లు ఉన్నాయి. వీటిలో నాలుగు మ్యాచ్‌లలో ఐదు వికెట్ల స్పెల్స్ నమోదయ్యాయి.

మ్యాచ్ విషయానికొస్తే.. ఓవల్ టెస్టులో భారత్ అద్భుతంగా ఆడి ఇంగ్లండ్‌పై గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేసింది.

Leave a Reply