Vijaysai Reddy: సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వైసీపీ నుంచి కౌంటర్ అటాక్..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్నటి నుంచి వేడి పెంచిన అంశం.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. వైఎస్ జగన్‌పై ఆయన చేసిన విమర్శలు వైసీపీలో పెద్ద చర్చకు దారితీశాయి. తాజాగా, వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దీనిపై ఘాటుగా స్పందించారు.

సాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి, అసలు చంద్రబాబుకు సాయంగా మారాడని కాకాణి ఆరోపించారు. వైసీపీలో ఉన్నప్పుడు గంటల తరబడి జగన్ తో ఉండేది విజయసాయిరెడ్డినే. ఆయనకన్నా పెద్ద కోటరీ ఎవరున్నారు? చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే సాయిరెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తోందని ఆయన అన్నారు.

నేను మంత్రిగా ఉన్నప్పుడు జగన్‌ను కలవడానికి వెళ్లినప్పుడల్లా లోపల సాయిరెడ్డి ఉండేవాడు. ఆయన ఉండగానే మేము లోపలికి వెళ్లడం కష్టమయ్యేది. జగన్ నిర్ణయాలకు ఆయన ప్రభావం చూపించేవాడు. ఇప్పుడు అదే వ్యక్తి కోటరీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. జగన్ అమాయకుడా? పార్టీ కీలక నిర్ణయాల్లో సాయిరెడ్డికి ప్రత్యేక స్థానం ఉండేదని, ఇప్పుడు అవే విషయాలు విమర్శించటం ఆశ్చర్యంగా ఉందని కాకాణి వ్యాఖ్యానించారు.

రాజ్యసభ పదవి తీసుకున్న తర్వాత, రాజకీయాలకు దూరమవుతానని చెప్పిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు ఈ రీతిలో వ్యాఖ్యలు చేయడం వెనుక కొత్త వ్యూహం ఉందని కాకాణి అనుమానం వ్యక్తం చేశారు. ఇది ముందస్తు ప్రణాళికలో భాగమేనేమో అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, పార్టీలో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు విమర్శలకు గురవుతుండటం చూస్తుంటే, ఇది పెద్ద స్క్రిప్ట్ లో భాగమేమో అనిపిస్తోందని పేర్కొన్నారు.

సాయిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. వైసీపీ లో కీలక నేతలు, ఎమ్మెల్యేలు సైతం ఈ విషయంపై మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. నిజంగా ఆయన మాటల్లో నిజముందా? లేక ఇది కొత్త రాజకీయ నాటకమా? అనేది వేచి చూడాలి!

Leave a Reply