ప్రఖ్యాత డైలాగ్ కింగ్ సాయి కుమార్ తన నటనతో తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమై యాభై ఏళ్లు పూర్తైన సందర్భంగా, ప్రతిష్ఠాత్మకమైన ‘కొమరం భీమ్’ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రతీ ఏడాది సినీ రంగానికి చెందిన ప్రముఖులకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 2024 సంవత్సరానికి గాను, ఈ గౌరవానికి సాయి కుమార్‌ను ఎంపిక చేసినట్లు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ సి. పార్థసారధి ప్రకటించారు.
గతంలో ఈ అవార్డును గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ, అల్లాణి శ్రీధర్, డా. రాజేంద్రప్రసాద్, గూడ అంజయ్య వంటి ప్రముఖులు అందుకున్నారు. 50 ఏళ్ల సినీ కెరీర్‌లో నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా సాయి కుమార్ చేసిన సేవలకు గాను ఈ అరుదైన గౌరవం ఆయనకు దక్కింది. అవార్డుతో పాటు రూ.51,000ల నగదు బహుమతిని కూడా అందజేయనున్నారు.
భారత కల్చరల్ అకాడమి, ఆదివాసి సాంస్కృతిక పరిషత్, ఓం సాయి తేజ ఆర్ట్స్ సంస్థలు గత 12 ఏళ్లుగా ఈ అవార్డు వేడుకలను నిర్వహిస్తున్నాయి. ఈ నెల 23న కొమరం భీమ్ జిల్లా అసిఫాబాద్‌లోని ప్రమీలా గార్డెన్స్‌లో పురస్కార మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.
సాయి కుమార్ తెలుగు సినిమా చరిత్రలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. “కనిపించే మూడు సింహాలు చట్టం, న్యాయం, ధర్మానికి ప్రతిరూపాలైతే… కనిపించని నాలుగో సింహం నా పోలీస్”, “అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప, హీరోలు, విలన్లు లేరన్నా…” వంటి సూపర్ హిట్ డైలాగ్స్ ఇప్పటికీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి.
డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి, హీరోగా, విలన్‌గా, ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న సాయి కుమార్ అనేక అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకోవడం ఆయన కెరీర్‌లో మరొక అద్భుతమైన అధ్యాయం.