ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గమైన మంగళగిరిలో ప్రజలకు ఓ విశేషమైన వార్త అందించారు. మంగళగిరిలోని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా, ప్రజలు ఉచితంగా ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించే వీలు కల్పించడం విశేషం. ఈ వార్త మంగళగిరి ప్రజలకు ఆనందాన్ని కలిగించింది.
ఈ రోజు మంత్రి నారా లోకేష్ తన ఉండవల్లి నివాసంలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను జెండా ఊపి ప్రారంభించారు. సుదూర ప్రాంతాల నుండి ఎయిమ్స్ హాస్పిటల్, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రయాణికులు రాకపోకల్లో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, మెగా ఇంజనీరింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని, వారి CSR నిధుల ద్వారా ఈ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రాజెక్ట్ కింద మెగా సంస్థ 2.4 కోట్ల రూపాయల విలువైన అత్యాధునిక 7 మీటర్ల రెండు ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులను అందించింది.
ఈ ఉచిత బస్సు సేవల్లో భాగంగా, ఒక బస్సు మంగళగిరి బస్టాండు నుండి ఎన్ఆర్ఐ జంక్షన్, డీజీపీ ఆఫీసు మీదుగా ఎయిమ్స్ హాస్పిటల్ వరకు నడుస్తుంది. మరో బస్సు మంగళగిరి బస్టాండు నుండి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాలస్వామి ఆలయానికి సేవలు అందిస్తుంది. ఎయిమ్స్ బస్సు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు, పానకాలస్వామి ఆలయానికి వెళ్లే బస్సు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రజలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తుంది.
ప్రతి బస్సు 18 మంది ప్రయాణికులను ఒకేసారి తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్, రియల్-టైమ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్, రివర్స్ పార్క్ అసిస్ట్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలు అమర్చబడ్డాయి. ఈ ఉచిత సేవల ద్వారా మంగళగిరి ప్రజలకు ప్రయాణం మరింత సులభతరంగా మారనుంది.